కలం, ఖమ్మం బ్యూరో: కొత్త ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటే లంచం ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ చేసిన ఓ గ్రామ పంచాయతీ కార్యదర్శి.. అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. ఖమ్మం(Khammam) జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ముదిగొండ (Mudigonda) మండలం భానాపురం గ్రామ పంచాయతీ పరిధికి చెందిన ఓ వ్యక్తి నూతన ఇంటి నిర్మాణానికి అనుమతి కోసం గ్రామ పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు.
అయితే ఇంటి నిర్మాణానికి అనుమతి మంజూరు చేయాలంటే రూ.25 వేల లంచం ఇవ్వాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి తమ్మిశెట్టి సురేష్ డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన అధికారులు పక్కా ప్రణాళికతో దాడి (ACB Raid) చేశారు. భానాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి తమ్మిశెట్టి సురేష్ బాధితుడి నుంచి రూ.25 వేల లంచం స్వీకరిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారులు నిందితుడి వద్ద లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని, తదుపరి విచారణ చేపట్టారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు త్వరలో వెల్లడించనున్నారు.
Read Also: అమ్రాబాద్ ఫారెస్ట్‌లో ఎన్ని పులులు ఉన్నాయంటే?
Follow Us On : WhatsApp

