కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ సీపీజీఈటీ (TG CPGET) 2026 పరీక్షల షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్షలను జూలై 8 నుంచి జూలై 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన వివిధ కేంద్రాల్లో నిర్వహించనున్నారు. అభ్యర్థుల సౌకర్యార్థం ఈ పరీక్షలను రోజుకు మూడు సెషన్ల చొప్పున పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో (Computer Based Test) జరుపుతారు.
ఉస్మానియా యూనివర్సిటీ (OU), కాకతీయ యూనివర్సిటీ (KU), జేఎన్‌టీయూహెచ్ (JNTUH) సహా రాష్ట్రంలోని 9 ప్రముఖ విశ్వవిద్యాలయాలు అందించే వివిధ పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ (మల్టిపుల్ ఛాయిస్) విధానంలో ఉంటుంది. అభ్యర్థులు 90 నిమిషాల వ్యవధిలో మొత్తం 100 మార్కులకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు, టైమ్‌టేబుల్, ఇతర సమాచారాన్ని అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (http://cpget.tgche.ac.in) లో సంప్రదించవచ్చు.

