కలం, వెబ్ డెస్క్: వింత వింత మాటలు, విభిన్న ఆహార్యంతో సోషల్ మీడియాలో ఫేమస్ అయిన ఉప్పల్ బాలు (Uppal Balu)కు పోలీసులు షాకిచ్చారు. వికారాబాద్‌లోని అనంతగిరి హిల్స్‌లో కారుపై ప్రమాదకర స్టంట్లు, రోడ్డుపై వింత చేష్టలు చేసినందుకు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ఉప్పల్ బాలు కొందరు తన స్నేహితులతో కలిసి అనంతగిరి కొండలకు వెళ్లాడు. అడవి మధ్యలో దారిలో థార్ కారుపై కూర్చొని ప్రమాదకర స్టంట్లు చేశాడు. అలాగే రోడ్డు మీద పరుగెత్తుతూ వింతగా ప్రవర్తించాడు.
ఈ వీడియోలు తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసుకున్నాడు. ఇవి కాస్తా వైరల్‌గా మారడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రమాదకర స్టంట్లు చేయడం, పుణ్యక్షేత్రంలో సోషల్ మీడియా ఫేమ్ కోసం వింతగా ప్రవర్తించడం పట్ల మండిపడ్డారు. దీంతో స్పందించిన వికారాబాద్ అటవీ శాఖ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఉప్పల్ బాలు తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దీనిపై ఉప్పల్ బాలు కూడా స్పందిస్తూ మరో వీడియో తీశాడు. ఏదో సరదాకు వీడియో తీసుకున్నానని, ఇంత వైరల్ అవుతుందని అనుకోలేదని చెప్పాడు.

