కలం, నల్లగొండ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సుదీర్ఘ కాలం తర్వాత నల్లగొండ (Nalgonda) జిల్లాలో ఆదివారం పర్యటించనుండగా రాజకీయాల్లో ఒక్కసారిగా సీన్ మారింది. రూ.13వేల కోట్ల భారీ బడ్జెట్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనుండగా అధికార కాంగ్రెస్ క్యాడర్లో జోష్ నెలకొంది. సీఎం పర్యటన సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జిల్లా అధికారులు, పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే జిల్లాలో తీవ్ర నిరుద్యోగ సమస్యపై సీఎం ఎలాంటి స్పష్టత ఇస్తారనే ఉత్కంఠ నెలకొంది.
నల్లగొండ, చౌటుప్పల్, మిర్యాలగూడ, నార్కట్‌పల్లి ప్రాంతాల్లో వందలాది ఫార్మా, కెమికల్, సిమెంట్, రైస్ మిల్లుల పరిశ్రమలు ఉన్నాయి. స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో జరుగుతున్న అన్యాయంపై తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇక్కడి పరిశ్రమల్లో మేనేజ్మెంట్, టెక్నికల్, ఆఫీస్ జాబ్ లన్నీ ఇతర జిల్లాల వారికి, వేరే రాష్ట్రాల వారికి కట్టబెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్థానికులకు కేవలం స్వీపింగ్, సెక్యూరిటీ గార్డులు, డైలీ లేబర్ వంటి తక్కువ జీతం వచ్చే శారీరక శ్రమతో కూడిన పనులు మాత్రమే ఇస్తున్నారు. పరిశ్రమల యాజమాన్యాలు స్థానిక కోటాను అమలు చేసేలా సీఎం రేవంత్ తన పర్యటనలో కఠినమైన ఆదేశాలు జారీ చేయాలని, లేదా జిల్లాకు ప్రత్యేకంగా ఐటీ టవర్స్, కాలుష్య రహిత ఉపాధి కల్పించే పరిశ్రమలను ప్రకటించాలని నిరుద్యోగ యువత కోరుతున్నది.
హ్యామ్ రోడ్ల పైలాన్ ఆవిష్కరణ
సీఎం పర్యనటలో భాగంగా కనగల్ మండలంలో ఏఎంసీ మార్కెట్ యార్డ్ వద్ద ఆర్అండ్బీ ‘ హ్యామ్’ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం నల్లగొండ కార్పొరేషన్ పరిధిలో తొలి విడత తాగునీటి సరఫరా ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేస్తారు. ఎన్జీ కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం మాట్లాడతారు. జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళా ప్రతినిధులకు కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆర్థిక సాయం, బ్యాంక్ లింకేజీ చెక్కులను పంపిణీ చేస్తారు.
వరాలు కురిపించేనా..?
రూ.13 వేల కోట్ల రోడ్ల నెట్వర్క్ జిల్లా ముఖచిత్రాన్ని మార్చనున్నప్పటికీ దశాబ్దాలుగా వేధిస్తున్న కీలక సమస్యలపై సీఎం ఎలాంటి ప్రకటన చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. జిల్లాలోని పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతానికి పైగా ఉద్యోగాలు దక్కేలా చట్టాన్ని కఠినతరం చేసే ప్రస్తావన వేదికపై నుంచే స్పష్టత ఇస్తారా అనే చర్చ జరుగుతున్నది. హైదరాబాద్ శివార్ల నుంచి నల్లగొండ మీదుగా ప్రవహిస్తున్న మూసీ నది ప్రక్షాళనపై ప్రత్యేక ప్యాకేజీ లేదా కార్యాచరణ ప్రకటిస్తారా..! అని ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా నత్తనడకన సాగుతున్న శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగ మార్గం పనులకు నిధులు కేటాయించి, మునుగోడు, దేవరకొండ ప్రాంతాల సాగునీటి కష్టాలు తీర్చాలనే డిమాండ్ కూడా వినిపిస్తున్నది.
కాంగ్రెస్ క్యాడర్లో జోష్..
రాజకీయంగా ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ కు కంచుకోట. గత అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం ఉమ్మడి జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టలేదనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అత్యంత ప్రతిష్టాత్మకం. జిల్లాలో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు, గతంలో విపక్షాలు చేసిన విమర్శలకు అభివృద్ధి పనులతో చెక్ చెప్పవచ్చని కాంగ్రెస్ క్యాడర్ భావిస్తున్నది. ఉమ్మడి జిల్లా నుంచి లక్షలాది మందిని సభకు తరలించేందుకు పార్టీ లీడర్లు నిమగ్నమయ్యారు. ఎన్జీ కాలేజీ గ్రౌండ్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లా ఎలాంటి వరాల జల్లు కురిపిస్తారో చూడాల్సి ఉంది.

