కలం, వెబ్ డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమ ఏర్పాట్లపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 5 సంవత్సరాలోపు వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు అందేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒక్క చిన్నారి కూడా మిస్ అవ్వకుండా బూత్‌లు, మొబైల్ బృందాలు, ఇంటింటి సర్వేల ద్వారా పోలియో డ్రాప్స్ అందించాలని దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆరోగ్యశాఖలోని వివిధ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
నిండు జీవితానికి రెండు చుక్కలు..
జూన్ 28న రాష్ట్రవ్యాప్తంగా పోలియో బూత్‌లలో డ్రాప్స్ వేయనున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి మిగిలిపోయిన చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేసేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో పట్టణ ప్రాంతాలు విస్తృతంగా ఉండటంతో జూలై 1న అదనంగా మరో రోజు కార్యక్రమాన్ని నిర్వహించాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా వలస కార్మికుల పిల్లలు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లోని బస్తీలు, కొత్త కాలనీలు, గిరిజన ప్రాంతాల్లోని చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. మహిళా శిశు సంక్షేమం, మున్సిపల్, పంచాయతీరాజ్, విద్యాశాఖ, ఆర్టీసీ తదితర శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 22,979 పోలియో బూత్‌లు..
తెలంగాణలో చివరి పోలియో కేసు 2007లో నమోదు అయిందని అధికారులు మంత్రికి వివరించారు. పోలియో రహిత తెలంగాణ లక్ష్యాన్ని ఉమ్మడి రాష్ట్రంలోనే సాధించామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్రవ్యాప్తంగా 22,979 పోలియో బూత్‌లు, 903 మొబైల్ బృందాలు, 903 ట్రాన్సిట్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సుమారు 40.97 లక్షల మంది 0–5 ఏళ్ల చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం 52.04 లక్షల బీవోపీవీ (bOPV) టీకా డోసులు జిల్లాలకు సరఫరా చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో 8,393 ఏఎన్‌ఎంలు, 27,181 ఆశా కార్యకర్తలు, 34,442 అంగన్‌వాడీ కార్యకర్తలు, నర్సింగ్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నట్లు సమీక్షలో తెలిపారు.

