కలం, ఖమ్మం బ్యూరో: సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని భద్రాచలం (Bhadrachalam) డీఎస్పీ అరుణ్ కుమార్ (DSP Arun Kumar) స్పష్టం చేశారు. పద్ధతి మార్చుకోని రౌడీషీటర్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శుక్రవారం భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్లో రౌడీషీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించిన డీఎస్పీ, వారి ప్రస్తుత జీవన విధానం, గతంలో నమోదైన కేసుల వివరాలను తెలుసుకున్నారు. నేరాలకు దూరంగా ఉండి బాధ్యతాయుతమైన పౌరులుగా సమాజంలో జీవించాలని సూచిస్తూ, భవిష్యత్తులో ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడవద్దని హెచ్చరించారు.
రౌడీషీటర్ల కదలికలపై పోలీసుల నిరంతర నిఘా కొనసాగుతుందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ తెలిపారు. అదే సమయంలో తమ ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చి నేరాలకు పూర్తిగా దూరంగా ఉండే వారిని రౌడీషీటర్ల జాబితా నుంచి తొలగించే అంశాన్ని కూడా పరిశీలిస్తామని భరోసా ఇచ్చారు. పట్టణంలో ప్రశాంత వాతావరణం కొనసాగేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కౌన్సిలింగ్ కార్యక్రమంలో సీఐ నాగరాజు, ఎస్ఐలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

