కలం, వెబ్ డెస్క్: రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ‘వారణాసి’ (Varanasi) షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీపై దర్శకధీరుడు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే యాక్షన్ సహా అత్యంత కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసినట్లు వెరైటీ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం చిన్న చిన్న సీన్లు తీస్తున్నామని.. అక్టోబర్ నాటికి మొత్తం షూట్ పూర్తవుతుందన్నారు. 2027 ఏప్రిల్ 7వ తేదీన వారణాసి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.
కొత్త అనుభూతి ఇవ్వబోతుంది..
వారణాసిని రియల్ ఐ మ్యాక్స్ సాంకేతికతతో షూట్ చేస్తున్నట్లు రాజమౌళి వివరించారు. ఇప్పటివరకు సినిమాస్కోప్ ఫార్మాట్ ప్రేక్షకులకు బాగా అలవాటు పడిందని.. ఐమ్యాక్స్ ఫార్మాట్ కూడా కొత్త అనుభూతి ఇవ్వబోతుందన్నారు. 2027లో వారణాసి విడుదలయ్యే సమయానికి హైదరాబాద్‌లో ఐమ్యాక్స్ థియేటర్లు రాబోతున్నాయని, ఇది తనకు చాలా ఆనందం కలిగించే విషయమన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సినిమాల పట్ల చూపించే ఆదరణ ప్రపంచంలో ఎక్కడా కూడా చూడలేమన్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్.. ఇలా ఏ భాషల్లో మంచి సినిమాలు వచ్చినా ఆదరిస్తారని పేర్కొన్నారు.

