కలం, ఖమ్మం బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు (Payam Venkateswarlu) అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు (Manuguru) మండలంలో శుక్రవారం ఆయన విస్తృతంగా పర్యటించి రూ.7.11 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా సాంబాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో సుమారు రూ.5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బ్రిడ్జిలు, కల్వర్టుల పనులను ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. నిర్మాణాలలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా నిర్ణీత గడువులోపు పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు, ఇంజినీర్‌లకు ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం పగిడెరు గ్రామంలో రూ.1.25 కోట్ల వ్యయంతో శాంతినగర్ నుంచి కొడిసెలకుంట వరకు నిర్మించనున్న నూతన బీటీ రహదారి పనులకు భూమిపూజ చేశారు. అలాగే రూ.86 లక్షల వ్యయంతో ఎస్టీ కాలనీ–పోచంపల్లి వాగుపై నిర్మించనున్న వంతెన పనులను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, దశాబ్దాలుగా రవాణా సౌకర్యాల లేమితో ఇబ్బందులు పడుతున్న ప్రజలు, రైతులు, విద్యార్థుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ఈ నిధులు మంజూరు చేయించామని తెలిపారు.
రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణంతో గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మారనున్నాయని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ పినపాక నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలలో సంబంధిత శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Also: రైతులకు సోలార్ ‘పంట’.. త్వరలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం
Follow Us On: Instagram

