కలం, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఏఐ ట్రెండ్ నడుస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఏఐ వీడియోలే (AI Video) దర్శనమిస్తున్నాయి. కొన్ని కొన్ని చూస్తుంటే నిజమా, లేక ఏఐతో క్రియేట్ చేశారా అని అనుమానం కూడా కలుగుతోంది. చిన్న పిల్లలను కూడా నడుస్తున్నట్లు, పాడుతున్నట్లు, డ్యాన్స్ చేస్తున్నట్లు వీడియోలు క్రియేట్ చేసేస్తున్నారు. సరిగ్గా ఇలాంటిదే ఓ చిన్నారి వీడియో సీఎం చంద్రబాబు (CM Chandrababu)ను విపరీతంగా ఆకట్టుకుంది. విక్టరీ వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాలోని డైలాగులతో ఉన్న ఈ వీడియోను సీఎం తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసుకున్నారు.
నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో వెంకటేశ్ హీరోయిన్‌కు తన ఫ్లాష్‌బ్యాక్ అంటూ ఫేక్ స్టోరీ చెప్తాడు. అందులో తనకు ఓ కల ఉండేదని, తాను కలెక్టర్ అయి సీఎం చంద్రబాబుతో కాన్ఫరెన్స్‌లో ఉన్నప్పుడు తన తండ్రి కిటికిలో నుంచి చూడటం, తాను సీఎంతో తన తండ్రి వెయిట్ చేస్తున్నారని చెప్పడం గురించి ఓ కట్టు కథ చెప్తాడు. సరిగ్గా ఇదే డైలాగ్‌తో ఓ నెటిజన్ తన కూతురి వీడియో చేశారు. చిన్నారి అర్ణ ఐఏఎస్‌గా తన ఆఫీస్‌లో సీఎం చంద్రబాబుతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నట్లు, ఆమె తండ్రి కిటికిలో నుంచి చూస్తున్నట్లు క్రియేట్ చేశారు. ఇది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియో సీఎం చంద్రబాబు వరకూ వెళ్లింది. ఈ క్యూట్ చిన్నారిని చూసి ముచ్చటపడ్డ సీఎం తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసి ఎవరూ నవ్వకుండా ఉండలేరని సీఎం చంద్రబాబు అన్నారు.

