కలం, వెబ్ డెస్క్: ఏపీలో మిస్టరీగా మారిన చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసు (Jahnavi Missing Case)లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలకంగా భావించిన కుక్క అనుమానాస్పద స్థితితో మృతి చెందిన విషయం తెలిసిందే. నేడు ఆ కుక్క పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది. తుని (Tuni)లో ఆయిల్ ఫామ్ తోటలో చిన్నారి అదృశ్యమైన రోజు వాళ్లు ఇంట్లో పెంచుకునే కుక్క కూడా చిన్నారి వెంటే వెళ్లడం సీసీ కెమెరాలో చిక్కింది. ఈ నేపథ్యంలో కుక్క ఆచూకీ కనుక్కున్నా చిన్నారి దొరుకుతుందని అంతా భావించారు. సుమారు 500 మంది పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రోజుల తరబడి చిన్నారి కోసం గాలించారు.
ఈ క్రమంలో ఒక రోజు కుక్క మళ్లీ వెనక్కి వచ్చింది. దీంతో చిన్నారి ఆచూకీ దొరుకుతుందని అంతా భావించారు. కానీ, కుక్క చిన్నారి వెంట వెళ్లలేదని, దగ్గర్లోని ఊరిలో తిరిగి వచ్చిందని సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిర్ధారించారు. తిరిగి వచ్చిన రెండు రోజులకే కుక్క వింతవింతగా ప్రవర్తిస్తూ ప్రాణాలు కోల్పోయింది. ఇక పోస్టు మార్టం రిపోర్టులో కుక్క ఆహారం సరిగా తినకపోవడం వల్లనే మృతి చెందినట్లు తేలింది. దీంతో ఈ కేసులో ఉన్న ఏకైక ఆధారం చేజారిపోయింది. ఇక పోలీసులు తదుపరి ఏం చేస్తారన్నది వేచి చూడాలి. మరోవైపు జాహ్నవి మిస్ అయ్యి 20 రోజులు కావొస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

