కలం, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా తాడిపత్రి (Tadipatri)లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ (YCP), టీడీపీ (TDP)ల పోటాపోటీ కార్యక్రమాలతో ఎప్పుడు, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. జేసీ ప్రభాకర్ రెడ్డి హింసా రాజకీయాలు చేస్తున్నారని, ఆయన దౌర్జన్యాలకు వ్యతిరేకించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ వైసీపీ నేడు స్థానిక గాంధీ విగ్రహం ఎదుట నిరసనకు పిలుపునిచ్చింది. ఈ దీక్షకు వ్యతిరేకంగా నల్ల దుస్తులతో నిరసన తెలపాలని జేసీ ప్రభాకర్ రెడ్డి కేడర్‌కు పిలుపునిచ్చారు. దీంతో శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకున్న పోలీసులు ఇరు కార్యక్రమాలకు అనుమతి నిరాకరించారు.
వైసీపీ నేత పెద్దారెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే ఆయన నోటీసులు తీసుకోలేదు. పెద్దారెడ్డి దీక్షకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ఇంటి ఎదుటే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పెద్దారెడ్డి ఆరోపించారు. పోలీసులు పెద్దారెడ్డి ఇంటికి వెళ్లే నాలుగు దారులు మోహరించారు. అయినప్పటికీ వైసీపీ నేతలు పెద్దా రెడ్డి ఇంటికి భారీ స్థాయిలో చేరుకుంటున్నారు. అనంతపురంలోని వైసీపీ ఆఫీసు కూడా కార్యకర్తలతో కోలాహలంగా మారింది. దీంతో అనంతపురం , తాడిపత్రి ప్రాంతాల్లో హై టెన్షన్ నెలకొంది.

