Mobile Popup Ad
Mobile Popup Ad

మా ఊరి పిల్లలంతా ప్రభుత్వ బడికే.. ఆదర్శంగా న్యూ పోచంపాడ్‌!

కలం, వెబ్ డెస్క్: నిర్మల్ (Nirmal) రూరల్ మండలం న్యూ పోచంపాడ్ గ్రామం స్పూర్తిదాయకమైన నిర్ణయంతో ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామ భవిష్యత్తు, ప్రభుత్వ విద్యా వ్యవస్థ పరిరక్షణ కోసం గ్రామస్థులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుండటంతో గ్రామంలో ఆందోళన వ్యక్తమైంది. ప్రస్తుతం అంగన్వాడీలో కేవలం ఇద్దరు పిల్లలు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 15 మంది విద్యార్థులు మాత్రమే హాజరవుతున్నారు.

ఒక్కటైన గ్రామస్థులు..

చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపుతుండటంతో ప్రభుత్వ బడి ఖాళీ అవుతోంది. పరిస్థితిని గమనించిన పంచాయతీ పాలకవర్గం, గ్రామ అభివృద్ధి కమిటీ, తల్లిదండ్రులు, యువకులు కలిసి “మన బడిని మనమే కాపాడుకోవాలి” అనే నినాదంతో ముందుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫారాలు వంటి అనేక సౌకర్యాలు అందుతున్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదని చర్చించారు.

వారికి ప్రభుత్వ పథకాలు కట్..

ఇకపై గ్రామంలోని ప్రతి కుటుంబం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని నిర్ణయించారు. ఎవరైనా ప్రైవేట్ పాఠశాలలకు పంపితే వారికి గ్రామస్థాయిలో అమలు చేసే ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను నిలిపివేయాలని కూడా తీర్మానించారు. గ్రామస్థుల నిర్ణయంతో ప్రభుత్వ విద్యపై మళ్లీ నమ్మకాన్ని పెంచేలా ఉందని చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేయడంలో న్యూ పోచంపాడ్ గ్రామం తీసుకున్న ఈ నిర్ణయం ఇతర గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలవొచ్చని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>