కలం, కరీంనగర్ బ్యూరో : జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ (Jagtial Collector Satya Prasad) ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మమేకమై వారికి పాఠాలు బోధించారు. విద్యార్థుల అభ్యాస స్థాయిని తెలుసుకుంటూ విద్యా ప్రమాణాల పై ఆరా తీశారు. అనంతరం పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన కలెక్టర్.. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందుతున్నదీ లేనిదీ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
భోజన నాణ్యతను విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పరిశుభ్రత, పాఠశాల నిర్వహణ పై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్.. విద్యార్థినుల కోసం అదనపు డార్మెటరీ అవసరాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వెంటనే డార్మెటరీ నిర్మాణానికి అనుమతి మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీఓ జీవాకర్ రెడ్డి, ఎస్సీ వెల్ఫేర్ అధికారి రాజ్‌కుమార్, బీసీ వెల్ఫేర్ అధికారి జయరాజ్, తహసీల్దార్, పాఠశాల సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

