కలం, క్రైమ్ బ్యూరో : హైదరాబాద్‌లోని ఐఎస్ సదన్‌లో ఇటీవల జరిగిన భారీ దోపిడి కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్‌తో పాటు అతడి ఇద్దరు కొడుకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే .. జూన్ 23న ఐఎస్ సదన్‌లోని ఓ ఏటీఎంలో నింపాల్సిన డబ్బును దుండగులు ఎత్తుకెళ్లారు (ATM Robbery ). ఓ ఏటీఎంలో డబ్బు పెట్టేందుకు సిబ్బంది లోపలికి వెళ్లగా బైక్ పై వచ్చిన దుండగులు వ్యాన్‌లో ఉన్న రూ. 17 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు.
అయితే ఈ దోపిడి అనంతరం డ్రైవర్ కూడా కనిపించకుండా పోయాడు. దీంతో ఈ దోపిడికి వెనుక డ్రైవర్ హస్తం ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పక్క ప్లాన్ ప్రకారం దోపిడి జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఐఎస్ సదన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలు నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగాయి. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు డ్రైవర్, అతని కొడుకుల మోసాన్ని బట్టబయలు చేశారు. ఈ నేపథ్యంలోనే వ్యాన్ డ్రైవర్ శ్రీనివాస్ (42) అతడి ఇద్దరు కుమారులు జాన్ (22), జశ్వంత్ (20) లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 14 లక్షల నగదు, బైక్, నాలుగు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

