కలం, స్పోర్ట్స్: హాకీ వరల్డ్ కప్‌లో(Hockey World Cup) ఈసారి కొత్త ఫార్మాట్ అమలులోకి రానుంది. లీగ్ దశలో సాధించిన పాయింట్లే తర్వాతి దశలోనూ కొనసాగనున్నాయి. దీంతో భారత్‌కు తొలి మ్యాచ్ నుంచే విజయాలు సాధించడం అత్యంత కీలకం కానుంది. బెల్జియం, నెదర్లాండ్స్ వేదికలుగా జరగనున్న పురుషుల, మహిళల హాకీ వరల్డ్ కప్‌లో మూడు దశల విధానాన్ని అమలు చేయనున్నారు. తొలి దశలో 16 జట్లను నాలుగు పూల్స్‌గా విభజిస్తారు. ప్రతి పూల్‌లో టాప్-2లో నిలిచిన జట్లు రెండో దశకు అర్హత సాధిస్తాయి. మిగిలిన ఎనిమిది జట్లు క్లాసిఫికేషన్ దశలోకి వెళ్తాయి. వాటిని మరో రెండు పూల్స్‌గా విభజిస్తారు.
రెండో దశలో తొలి దశలో తమతో పాటు అర్హత సాధించిన జట్టుపై సాధించిన పాయింట్లు కొనసాగుతాయి. ఈ దశలో ప్రతి జట్టు రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. ఇప్పటికే ఎదురైన జట్టుతో మరోసారి తలపడాల్సిన అవసరం ఉండదు. మూడో దశలో ఈ, ఎఫ్ పూల్స్‌లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు చేరతాయి. మూడో స్థానంలో నిలిచిన జట్లు ఐదు, ఆరు స్థానాల కోసం పోటీ పడతాయి. నాలుగో స్థానంలో ఉన్న జట్లు ఏడు, ఎనిమిది స్థానాల కోసం తలపడతాయి.
భారత్‌కు లీగ్ దశే కీలకం
కొత్త ఫార్మాట్లో లీగ్ దశలో సాధించిన పాయింట్లకు ప్రాధాన్యం ఉండటంతో భారత్‌కు ప్రతి మ్యాచ్ కీలకంగా మారింది. వీలైనన్ని ఎక్కువ పాయింట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని భారత పురుషుల జట్టు చీఫ్ కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ సూచించారు.
భారత్ పురుషుల షెడ్యూల్ — పూల్ డీ
ఆగస్టు 15: భారత్ vs వేల్స్ – సాయంత్రం 4:30 గంటలకు
ఆగస్టు 16: భారత్ vs ఇంగ్లండ్ – సాయంత్రం 6:30 గంటలకు
ఆగస్టు 19: భారత్ vs పాకిస్థాన్ – సాయంత్రం 6:30 గంటలకు
భారత్ మహిళల షెడ్యూల్ — పూల్ డీ
ఆగస్టు 16: భారత్ vs చైనా – సాయంత్రం 4:30 గంటలకు
ఆగస్టు 18: భారత్ vs దక్షిణాఫ్రికా – సాయంత్రం 6:30 గంటలకు
ఆగస్టు 20: భారత్ vs ఇంగ్లండ్ – సాయంత్రం 6:30 గంటలకు
వరల్డ్ కప్‌లో భారత్ గత ప్రదర్శన
భారత పురుషుల జట్టు 1975లో ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. 1973లో రన్నరప్‌గా, 1971లో మూడో స్థానంలో నిలిచింది. అయితే 2023 వరల్డ్ కప్‌లో భారత్ తొమ్మిదో స్థానంతో టోర్నీని ముగించింది.మహిళల జట్టు 1974లో నాలుగో స్థానంలో నిలిచింది. 2022లో తొమ్మిదో స్థానంతో టోర్నీని ముగించింది. కొత్త ఫార్మాట్లో తొలి దశ ఫలితాలకు మరింత ప్రాధాన్యం ఉండటంతో.. ఈసారి భారత్‌కు లీగ్ మ్యాచ్‌లే కీలకంగా మారనున్నాయి. ఆరంభ మ్యాచ్‌ల నుంచే పాయింట్లు సాధిస్తేనే తర్వాతి దశలో మెరుగైన స్థితిలో ఉండే అవకాశం ఉంటుంది.

