కలం, క్రైమ్ బ్యూరో: శామీర్పేట్ తహశీల్దార్ సుచరిత నివాసంలో మరోసారి ఏసీబీ సోదాలు (ACB Raids) నిర్వహించారు. మే 26న ఆమె రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కగా, కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అయితే, భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు గురువారం ఆమె నివాసంతో పాటు మరో మూడు ప్రాంతాల్లో మరోసారి సోదాలు నిర్వహించారు. సోదాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం దామరకుంటలో 2 ఎకరాల 17 గుంటల వ్యవసాయ భూమి, హైదరాబాద్లో 3 ప్లాట్లు, కీసర, ఖానామెట్ గ్రామాల్లో రెండు ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సుచరిత నివాసంలో రూ.12 లక్షల నగదు, రెండు కార్లు, రూ.1.20 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో భాగంగా గుర్తించిన ఆస్తుల విలువ రూ.5.5 కోట్లకు పైనే ఉంటుందని, మార్కెట్ ధర గుర్తించిన దానికంటే ఎక్కువనే ఉండే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు.

