కలం, ఖమ్మం బ్యూరో: భార్యపై కక్షగట్టిన ఓ భర్త వేట కొడవలితో దాడి చేసి విచక్షణారహితంగా గాయపర్చాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా దుమ్ముగూడెం మండలం బైరాగులపాడులో జరిగింది. ఈ ఘటన మంగళవారం స్థానికంగా కలకలం రేపింది. దాడిలో తీవ్రంగా గాయపడిన భార్య ప్రాణభయంతో పరుగులు తీసింది. దాడి అనంతరం భర్త అక్కడి నుంచి పరారయ్యాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. బైరాగులపాడు గ్రామానికి చెందిన మహేశ్వరి, శివాజీ దంపతుల మధ్య ఐదేండ్లుగా కుటుంబ కలహాలు నడుస్తున్నాయి. భర్త వేధింపులు తాళలేక మహేశ్వరి దూరంగా ఉంటోంది. గతంలో కూడా శివాజీ దాడి చేయడంతో దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది.
కాగా, డ్వాక్రా రుణానికి సంబంధించిన పనిపై మహేశ్వరి బైరాగులపాడుకు వచ్చిన సమయంలో భర్త శివాజీ వేటకొడవలితొ ఒక్కసారిగా దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తం ఓడుతున్న స్థితిలోనే మహేశ్వరి కేకలు వేస్తూ ప్రాణాలు దక్కించుకోవడానికి పరుగులు తీసింది.
గమనించిన స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. రక్తస్రావం ఎక్కువగా కావడంతో ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుడి అచూకీ కోసం సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే అతన్ని అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు.

