కలం, వెబ్ డెస్క్: మహిళల టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్ రేసు రసవత్తరంగా మారిన వేళ, బంగ్లాదేశ్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో భారత (IND vs BAN) జట్టు ఫీల్డింగ్ తప్పిదాలు మరోసారి బయటపడ్డాయి. టోర్నీలో ముందడుగు వేయాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో, భారత ఫీల్డర్లు పవర్‌ప్లేలోనే ఏకంగా నాలుగు క్యాచ్‌లు వదిలేసి బంగ్లాదేశ్ బ్యాటర్లకు లైఫ్ ఇచ్చారు. ఈ ముఖ్యమైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానా మొదట బ్యాటింగ్ ఎంచుకున్నారు. గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయిన భారత జట్టు, ఈ మ్యాచ్ కోసం రెండు మార్పులు చేసింది.
ప్రేమ యాదవ్, అరుంధతి రెడ్డి స్థానాల్లో రాధా యాదవ్, రేణుక ఠాకూర్లను జట్టులోకి తీసుకుంది. మరోవైపు పాకిస్తాన్‌పై గెలిచిన ఉత్సాహంలో ఉన్న బంగ్లాదేశ్ ఎలాంటి మార్పులు లేకుండా అదే జట్టుతో బరిలోకి దిగింది. ప్రస్తుతం గ్రూప్-1లో ఆస్ట్రేలియా నాలుగు విజయాలతో అగ్రస్థానంలో ఉండగా.. భారత్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు తలా నాలుగు పాయింట్లతో సమానంగా ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్ ఫలితం సెమీస్ రేసులో చాలా కీలకంగా మారింది.
అయితే ఇన్నింగ్స్ ప్రారంభంలోనే భారత ఫీల్డర్లు (IND vs BAN) వరుస తప్పులతో బంగ్లాదేశ్‌పై ఒత్తిడి పెంచే అవకాశాన్ని చేజార్చుకున్నారు. మూడో ఓవర్లో శ్రీ చరణి బౌలింగ్‌లో జువైరియా ఫెర్దౌస్ ఇచ్చిన క్యాచ్‌ను యాస్తికా భాటియా డైవ్ చేసినా అందుకోలేకపోయారు. ఆ తర్వాతి ఓవర్లోనే రేణుక సింగ్ బౌలింగ్‌లో అదే జువైరియా ఇచ్చిన సులువైన క్యాచ్‌ను నమ్మకమైన ఫీల్డర్ రాధా యాదవ్ చేజార్చడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన గత మ్యాచ్‌లో కూడా రాధా యాదవ్ రెండు క్యాచ్‌లు వదిలేశారు. ఆ మ్యాచ్‌లో ఆ లైఫ్‌లతో మరిజాన్ కాప్ అజేయంగా 81 పరుగులు చేసి భారత్ ఓటమికి కారణమయ్యారు.
భారత్ మిస్ చేసిన క్యాచ్‌ల పరంపర అక్కడితో ఆగలేదు. ఐదో ఓవర్లో శ్రీ చరణి బౌలింగ్‌లోనే శోభన మోస్తరి ఇచ్చిన క్యాచ్‌ను నందిని శర్మ అందుకోలేకపోయారు. ఆ మరుసటి బంతికే జువైరియా ఇచ్చిన మరో క్యాచ్‌ను కూడా నందిని డైవ్ చేసినా పట్టుకోలేకపోయారు. ఇలా కేవలం 11 బంతుల వ్యవధిలో నాలుగు క్యాచ్‌లు చేజారడంతో భారత ఆటగాళ్లలో తీవ్ర నిరాశ వ్యక్తమైంది. ఈ అవకాశాలను అందిపుచ్చుకున్న బంగ్లాదేశ్ తొలి ఒత్తిడి నుంచి కోలుకుని, పవర్‌ప్లే ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 40 పరుగులు చేసింది.

