కలం, కరీంనగర్ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన కరీంనగర్ (Karimnagar) పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో సరికొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుల పోలీసు కస్టడీ ముగిసినప్పటికీ దోచుకున్న బంగారం ఆచూకీ కనుగొనడం పోలీసులకు సవాల్‌గా మారింది. మరోవైపు ఈ దోపిడీ సొత్తు దేశ సరిహద్దులు దాటి నేపాల్ చేరినట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఈ దోపిడీ కేసులో నిందితులను పోలీసులు రెండు సార్లు కస్టడీకి తీసుకుని విచారించినప్పటికీ బంగారం ఎక్కడ? అంటే ముజ్ కో నహీ మాలూం అనే సమాధానమే చెబుతున్నారట.. ఒక టీమ్‌కు మరో టీమ్‌కు ఏమాత్రం సంబంధం లేకుండా పక్కా స్కెచ్‌తో జరిగిన ఈ అంతరాష్ట్ర దోపిడీ ముఠా గుట్టును పూర్తిగా రట్టు చేసేందుకు కరీంనగర్ పోలీసులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.
సుభోధ్ గ్యాంగ్ ముఠా చేసిన బంగారం దోపిడీని కనిపెట్టేందుకు 50 రోజులు పైగా పోలీసులు శ్రమిస్తూ కీలకమైన ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు దొంగలు పరారీలో ఉండగా వారితో పాటు బంగారం ఆచూకీ కోసం బీహార్ లో తిరుగుతున్నట్లు సమాచారం. అయితే కస్టడీలో ఉన్న సుభోధ్ సింగ్ మాత్రం ముజ్ కో నహీ మాలూం అంటూ తప్పుదారి పట్టిస్తున్నట్లు సమాచారం. పీఎన్‌జీ జ్యువెలరీలో దోచుకున్న సుమారు 116.4 తులాల బంగారు ఆభరణాలు, 112 క్యారెట్ల వజ్రాభరణాలు ఘటన జరిగిన మూడు రోజుల్లోనే దేశం దాటిపోయినట్లు తెలుస్తోంది. ‘గోల్డెన్ థీఫ్’ సుబోధ్ సింగ్ ప్రధాన అనుచరుడైన బిహార్‌కు చెందిన పుల్‌సింగ్ అలియాస్ రాజీవ్‌సింగ్.. ఈ ఆభరణాలను నేపాల్‌కు చెందిన నగల వ్యాపారి జీవన్‌కు అప్పగించినట్లు పోలీసులు గుర్తించారు. పుల్ సింగ్ కు కూడా నేపాల్ లో నగల దకాణాలున్నట్లు సమాచారం. వీరు ప్రస్తుతం బీహార్‌లోనే ఉన్నట్లు భావిస్తున్న పుల్‌సింగ్, జీవన్‌లను పట్టుకునేందుకు కరీంనగర్‌కు చెందిన ఒక ప్రత్యేక పోలీస్ బృందం అక్కడికి వెళ్ళింది.
ముగిసిన సుబోధ్ సింగ్ గ్యాంగ్ కస్టడీ.. ఆయుధాలు, బైక్‌లు స్వాధీనం
కోర్టు అనుమతితో పోలీస్ కస్టడీలోకి తీసుకున్న ప్రధాన నిందితుడు సుబోధ్ సింగ్, రఘునాథ్, రవీష్, అమర్ సింగ్, జైనుల్లాబ్దీన్ ల కస్టడీ బుధవారంతో ముగిసింది. ప్రధాన నిందితుడు సుబోధ్ సింగ్ నోరు విప్పకపోయినప్పటికీ, మిగతా నిందితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. నిందితుడు రఘునాథ్ ఇచ్చిన సమాచారంతో.. దోపిడీకి ఉపయోగించిన బైక్‌ను మహారాష్ట్రలోని బల్లార్షా రైల్వే స్టేషన్ సమీపంలో స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు సనోజ్ కుమార్ ఇచ్చిన సమాచారంతో రామడుగు శివార్లలోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద దాచిన ఐదు జతల దుస్తులు, మూడు జతల షూస్‌తో పాటు పిస్టల్, మ్యాగజైన్, మూడు బైక్‌లకు సంబంధించిన నకిలీ ఆర్సీ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇంకా పరారీలోనే ఇద్దరు దొంగలు..
ఈ కేసులో మొత్తం 13 మంది భాగస్వామ్యం ఉన్నట్లు గుర్తించగా, ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేశారు. దోపిడీలో ప్రత్యక్షంగా పాల్గొన్న రఘునాథ్ కర్మకార్, రవీష్ కుమార్, సనోజ్‌లను అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు దొంగలు ఇంకా పరారీలోనే ఉన్నారు. ఈ కేసులో భాగంగా బిహార్‌లోని పాట్నా జిల్లా పుల్వారీ షరీఫ్ వద్ద మరో నిందితుడు ఎండీ ఆదిల్ ఖాన్‌ను కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్సిట్ వారెంట్‌పై అతడిని కరీంనగర్‌కు తరలించి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం ఫూల్‌సింగ్, జీవన్ ఇద్దరూ బీహార్‌లోనే ఉన్నట్లు గుర్తించిన కరీంనగర్ ప్రత్యేక పోలీస్ బృందం, వారిని పట్టుకునేందుకు అక్కడ గాలింపు చర్యలు చేపట్టింది. ఆ ఇద్దరూ దొరికితేనే అసలు దోపిడీ బంగారం ఎక్కడ ఉందనే పూర్తి రహస్యం వెలుగులోకి రానుంది. “ఈ కేసులో నిందితులు ఎంత చాకచక్యంగా ప్లాన్ చేసినా పోలీసులు ఒక్కొక్కరిని పట్టుకుంటూ నెట్‌వర్క్‌ను ఛేదిస్తున్నారు. నేపాల్ వ్యాపారి లింక్ తేలితే ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

