కలం, వెబ్ డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు, కనీస మద్దతు ధర – ఎం ఎస్పీ(MSP)పై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Tummala Nageswara Rao) మంగళవారం కీలక సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ లోని గోల్కొండ హోటల్‌లో సీసీఐ సీఎండీ, అధికారులతో పత్తి కొనుగోళ్ల సన్నాహక ఏర్పాట్లపై చర్చించారు. ఈ మీటింగ్ లో పత్తి ఎంఎస్పీ ధరకు కొనుగోళ్లపై రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా నిర్వహించడం, కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు, అవసరమైన మౌలిక సదుపాయాలు, రైతులకు ఎంఎస్పీ ప్రయోజనం అందేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా పత్తి రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి (Minister Tummala) ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పత్తి కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. 15 – 30 రోజుల వ్యవధిలో అన్ని జిల్లాల్లో మిల్లులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లా మానిటరింగ్ కమిటీలలో రైతులను భాగస్వాములను చేయాలన్నారు. కపాస్ కిసాన్ యాప్ లో స్లాట్ బుకింగ్ విధానాన్ని మరింత సరళీకృతం చేయాలని చెప్పారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి రైతులకు మేలు కలిగేలా చూడాలన్నారు. పత్తి రైతుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లు 1800 599 5779, 88971 81111 వాట్సాప్ చాట్ బాట్ ఏర్పాటు చేశామని వివరించారు.
ఈ సమావేశానికి సీసీఐ సీఎండీ, వ్యవసాయ ఉత్పత్తుల కమిషనర్ & ప్రభుత్వ కార్యదర్శి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌తో పాటు వ్యవసాయ, అనుబంధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Also Read : తెలంగాణలో ముగిసిన ‘సర్’.. లెక్కలు చూస్తే షాక్!
Follow Us On : WhatsApp

