కలం, నిర్మల్: ప్లాస్టిక్ వినియోగం రోజురోజుకూ పెరుగుతూ పర్యావరణానికి, ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారుతున్న నేపథ్యంలో నిర్మల్ (Nirmal) రూరల్ మండలం చిట్యాల్ (Chityal) గ్రామం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాన్ని పూర్తిగా ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానించారు. గ్రామ సర్పంచ్ ఏనుగు సుప్రియ వెంకటరెడ్డి, పంచాయితీ పాలకవర్గం ఆధ్వర్యంలో మంగళవారం ప్లాస్టిక్ వ్యతిరేక అవగాహన (Plastic Awareness Rally) కార్యక్రమం నిర్వహించారు.
విద్యార్థులు, గ్రామస్తులతో కలిసి భారీ ర్యాలీ (Plastic Awareness Rally) నిర్వహించి ‘ప్లాస్టిక్‌ను వదిలేద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఇంటింటికీ తడి చెత్త, పొడి చెత్త సేకరణ కోసం బుట్టలతో పాటు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా స్టీల్ డబ్బాలు, స్టీల్ వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, డీఆర్డీఓ పీడీ విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజేందర్, రూరల్ తహశీల్దార్ ప్రభాకర్, రూరల్ ఎస్సై లింబాద్రి తదితరులు గ్రామస్తులకు ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించారు.
ప్లాస్టిక్ వినియోగం నిరంతరం పెరుగుతున్న తరుణంలో దాన్ని నియంత్రించేందుకు చిట్యాల్ గ్రామం స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్ సుప్రియ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. చిట్యాల్‌ను కేవలం ప్లాస్టిక్ రహిత గ్రామంగా కాకుండా పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో జిల్లాకే ఆదర్శంగా నిలిచే గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అన్నారు. గ్రామస్తులు, విద్యార్థులు, మహిళలు, యువత సహకారంతో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Also Read : నిర్మల్‌లో హిందూ యువ సమ్మేళనం.. ఆర్ఎస్ఎస్ పిలుపు
Follow Us On: Sharechat

