ప్రాజెక్టుల రద్దు యత్నం.. కేటీఆర్ కీలక నిర్ణయం!

కలం, వెబ్ డెస్క్​ : ప్రాజెక్టుల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోటర్లు ఆన్ చేయకుండా యాగాలు చేయడం ప్రజల దృష్టిని మళ్లించడానికేనని ఆయన మండిపడ్డారు. గురుదక్షిణ కింద నీళ్లు వదలకుండా మోటర్లు నడిపి యాగాలు చేస్తే ఉపయోగం ఉండేదని స్పష్టం చేశారు. ఏపీతో సహా అనేక రాష్ట్రాల ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు మాత్రం హోదా ఇవ్వమని పార్లమెంటులో తేల్చి చెప్పినా బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు నోరు మెదపకపోవడం శోచనీయమని విమర్శించారు. బీఆర్ఎస్ ఎంపీలు సభలో ఉంటే దీనిపై గట్టిగా పోరాడేవారని తెలిపారు.

జీఆర్‌ఎంబీ భేటీని బహిష్కరించకపోతే జలసౌధ ముట్టడి

తెలంగాణలోని 7 ప్రాజెక్టులను రద్దు చేసే ప్రతిపాదనపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (GRMB) సమావేశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బహిష్కరించకపోతే జలసౌధను ముట్టడిస్తామని కేటీఆర్ హెచ్చరించారు. కేసీఆర్ నాయకత్వంలో కేంద్రమే ఆ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చిందని, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పట్టుబట్టడంతో వాటిని అజెండాలో పెట్టడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. తెలంగాణ బీజేపీ ఎంపీలకు ధైర్యముంటే ఈ భేటీని బాయ్‌కాట్ చేయాలని సవాల్ విసిరారు. ఏపీ ప్రతిపాదనలపై మౌనంగా ఉండటం సరికాదని, రాష్ట్ర రైతాంగ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కుంభకోణాలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. అనుముల కొండల్ రెడ్డికి చెందిన టెసెరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ కంపెనీకి ఒక్క ఉద్యోగి, రూపాయి ఆదాయం, ఆఫీస్ చిరునామా కూడా లేవని కేటీఆర్ తెలిపారు. అయినా దాదాపు రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కేవలం రూ.7 కోట్లకు రేవంత్ రెడ్డి కట్టబెట్టారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తన మరో సోదరుడు అనుముల జగదీష్ రెడ్డితో కలిసి అమెరికాలో రూ.1000 కోట్లతో స్వచ్ బయో కంపెనీ పేరుతో ఒప్పందం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఆ కంపెనీకి ఎక్కడ భూమి ఇచ్చారో బయటకు తీయాలని డిమాండ్ చేశారు.

సింగరేణి వ్యవహారాలపై విమర్శలు

కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో చేతులు కలిపి రేవంత్ రెడ్డి తన బావమరిది సృజన్ రెడ్డికి రూ.1137 కోట్ల అమృత్ కాంట్రాక్ట్ ఇచ్చారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం కలిసి నడిపిస్తున్న సింగరేణిలో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు సృజన్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. రూ.200 కోట్ల విలువైన భూమిని నామమాత్రపు ధరకు టెసెరాక్ట్ కంపెనీకి కట్టబెట్టడం తీవ్ర అక్రమమని, ప్రజల ముందు ఈ అక్రమాలను నిలదీస్తామని కేటీఆర్ (KTR) పునరుద్ఘాటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>