Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రభుత్వ పథకాలు పేదలకు అందాలి: దాన కిషోర్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందేలా చూడాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన ఎం.దాన కిశోర్ (Dana Kishore) సూచించారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రత్యేకాధికారిగా నియమితులైన ఆయన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన 99 రోజుల కార్యాచరణపై కలెక్టరేట్‌లో కలెక్టర్ ఖుష్బూ గుప్తా, అధికారులతో కలిసి సమీక్ష చేశారు. జిల్లాలో ఈ కార్యక్రమం విజయవంతంగా అమలు చేసినందుకు అధికారులను అభినందించారు. గ్రామ, వార్డ్ సభల సందర్భంగా గుర్తించిన సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. నిధులతో సంబంధం లేనివి తక్షణం పరిష్కరించాలని అన్నారు. కేటగిరీ వారీగా ప్రతీ శాఖ గుర్తించిన సమస్యలకు అవసరమైన నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలన్నారు.

9 నెలల్లో భవనాల నిర్మాణం పూర్తి..

గ్రామాల్లో పంచాయతీ భవనాలు లేని చోట ఉపాధి హామీ పథకం నిధులతో వచ్చే 9 నెలల్లో భవనాలు పూర్తి చేయాలని దానకిషోర్ సూచించారు. కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లను నిర్మాణం చేయాలని డీఆర్డీవోకు సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణకు తగు చర్య తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు. ప్రతి శాఖ సాధించిన ఫలితాలు, విజయ గాథలతో 15 రోజుల్లో బుక్‌లెట్ రూపొందించాలన్నారు. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు నిర్వహించిన వైద్య పరీక్షల రిపోర్టులు పరిశీలించి, ఉత్తమ వైద్యం కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. అనీమియా, డయాబెటిస్, గైనిక్, కంటి సంబంధిత సమస్యలతో బాధపడేవారికి కావాల్సిన వైద్యం ఇవ్వాలన్నారు.

కంటి వైద్యం చేయించాలి..

ఫార్మా కంపెనీలతో మాట్లాడి సీఎస్ఆర్ నిధులతో కంటి సంబంధిత వ్యాధులున్న వారికి అవసరమైన మందులు, కళ్లద్దాలు ఉచితంగా అందించేలా చూడాలని దానకిషోర్ సూచించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటున్న బాలికలకు హాస్టళ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ది అధికారిని ఆదేశించారు. జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగే హాట్ స్పాట్స్ గుర్తించి సైన్ బోర్డ లు ఏర్పాటు చేయాలని రవాణా శాఖ అధికారిని ఆదేశించారు.

శాఖల కార్యక్రమాలు వివరించిన కలెక్టర్..

జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ.. మార్చి ఆరో తేదీ నుంచి నుంచి 15వ తేదీ వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో పాత ఫైల్స్ క్లియరెన్స్, పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించామన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో అర్రైవ్ అలైవ్ వారోత్సవాల్లో రహదారి భద్రతపై జిల్లా వ్యాప్తంగా ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించామన్నారు. ఉద్యానవన, క్రీడలు యువజన సర్వీసులు, సంక్షేమ, అటవీ, తదితర శాఖల కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ జానకి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి.హరిప్రియ, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సాయి శివాని, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>