కలం, వెబ్ డెస్క్: కూర నచ్చలేదని భార్యను భర్త చంపేసిన (Husband Kills Wife) ఘటన హైదరాబాద్‌లోని కాటేదాన్‌లో చోటు చేసుకుంది. శ్రీరామ్ నగర్‌లో చందన్ కుమార్, శిక్షాంజలి కుమారి దంపతులు నివాసం ఉంటున్నారు. ఆరు నెలల కిందటే వివాహం కాగా, కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి కూర విషయంలో మరోసారి గొడవ జరిగింది. కూర నచ్చలేదని శిక్షాంజలిని బలంగా నెట్టేయడంతో ఆమె తల గోడకు తగిలి అక్కడికక్కడే మరణించారు.
వెంటనే స్పృహ తప్పి పడిపోయిందని ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తలపై గాయాలు కావడాన్ని గమనించిన వైద్యులు.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు చందన్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

