కలం, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ (PM Modi) మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నారు. ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు మూడు రోజుల పాటు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారని కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీ ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్తున్నట్లు వివరించింది. సీషెల్స్ జాతీయ దినోత్సవమైన గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొనబోతుండటం గమనార్హం. మోదీ చివరి సారిగా 2015లో సీషెల్స్ దేశ పర్యటనకు వెళ్లారు. 11 ఏళ్ల విరామం తరువాత మళ్లీ పర్యటిస్తుండటంతో ఇరు దేశాలకు సంబంధించి కీలక ఒప్పందాలు చేసుకోబోతున్నారు.
జాతీయ అసెంబ్లీలో ప్రసంగం..
సీషెల్స్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ జాతీయ అసెంబ్లీలో ప్రసంగించబోతున్నారు. అలాగే, అక్కడ నివసిస్తున్న భారతీయులతోనూ ప్రత్యేక వేడుకలో పాల్గొంటారు. అనంతరం, అధ్యక్షుడితో కలిసి ద్వైపాక్షిక సంబంధాలు, సముద్ర భద్రత, ప్రాంతీచ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారు. భారత్–సెషెల్స్ మధ్య చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా మోదీ పర్యటన ఉండబోతుందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. కాగా, గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ఈసారి రెండు భారత నౌకలు కూడా సముద్రయాన వేడుకల్లో పాల్గొనబోతున్నాయని ప్రకటించింది.

