కలం, జోగుళాంబ గద్వాల: పోలింగ్ స్టేషన్ల వారీగా నియమించబడ్డ బీఎల్ఏలు SIR ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌గా నిర్వహించిన బీఎల్‌ఓలకు తమ సహకారాన్ని అందించాలని గద్వాల జిల్లా కలెక్టర్ (Gadwal Collector) రిజ్వాన్ బాషా షేక్ (Rizwanbasha Shaik) అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం చేపట్టిన ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా మొదట ఇంటింటి సర్వే చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో గురువారం గద్వాలలోని 26వ వార్డు గంట వీధి పోలింగ్ బూత్ 264 కు సంబంధించి బూత్ లెవెల్ అధికారులు చేస్తున్న ఇంటింటి సర్వేను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బీఎల్ఓలు తమ పరిధిలోని ప్రతి ఇంటికి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసి, నిర్దేశిత అంశాలన్నింటినీ ఓటర్లు పూరించి ఇచ్చేలా అవగాహన కల్పించాలన్నారు. రోజువారి వివరాలను బీఎల్ఓలు ఎప్పటికప్పుడు సంబంధిత యాప్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు.
ఇంటింటి సర్వే సందర్భంగా బీఎల్ఓ లతోపాటు బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా గుర్తింపు కార్డులను ధరించాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలువురు ఓటర్లతో మాట్లాడారు. కాలనీ వాసులు వివిధ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో గద్వాల తహశీల్దార్ హరికృష్ణ, ఎన్నికల ఉప తహశీల్దార్ ఉదయ్ కిరణ్, ఆర్ఐ వెంకటేశ్వర్ రెడ్డి, సూపర్‌వైజర్ నాగేంద్రమ్మ, బీఎల్ఓ శ్రీలత, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

