Mobile Popup Ad
Mobile Popup Ad

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీ

కలం, ఖమ్మం బ్యూరో : రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala)  గురువారం ఖమ్మం (Khammam) ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆసుపత్రికి చేరుకున్న మంత్రి, వివిధ విభాగాలను స్వయంగా పరిశీలించి అక్కడ అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించే పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని ఈ సందర్భంగా ఆయన అధికారులను హెచ్చరించారు. ఆసుపత్రిలోని పలు వార్డులను సందర్శించిన మంత్రి, చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మందుల లభ్యత, వైద్య సదుపాయాలు, పరిశుభ్రత వంటి అంశాలపై రోగుల నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరించారు.

వైద్యులు, సిబ్బంది రోగుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించిన మంత్రి, ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న క్రిటికల్ కేర్ భవన పనులను పరిశీలించిన ఆయన, నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేశారు. భవన ప్రారంభోత్సవానికి ముందే పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రి ప్రధాన రహదారికి ఇరువైపులా మొక్కలు నాటాలని, అంతర్గత రహదారులను మరమ్మతులు చేసి గుంతలు లేకుండా చేయాలని అధికారులకు ఆదేశించారు.

ఆసుపత్రి తనిఖీ అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నియోజకవర్గంలోని విడివోస్ కాలనీలో కొనసాగుతున్న ఓటరు మ్యాపింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఇంటింటి సర్వే, వివరాల నమోదు పురోగతిపై అధికారులతో చర్చించారు. నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా, వేగవంతంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదు అయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సుడా చైర్మన్ పువ్వాల్ల దుర్గాప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. నరేందర్, వైద్య శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>