Mobile Popup Ad
Mobile Popup Ad

ఆషాఢ బోనాలు.. అధికారులకు మంత్రి పొన్నం దిశానిర్దేశం

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఆషాడ మాసంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బోనాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పకడ్బందీగా బోనాలు నిర్వహించేందుకు ముందస్తు చర్యలు చేపట్టింది. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ బోనాల జాతర (Ashada Bonalu 2026)పై సమీక్ష చేపట్టారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCRHRD)లో ఆషాఢ మాస బోనాల జాతర – 2026పై అధికారులతో, ఉమ్మడి దేవాలయ కమిటీలతో మీటింగ్ నిర్వహించారు. ఈ ఏడాది జూలై 15 నుండి ఆగస్ట్ 13 వరకు ఆషాఢ మాస బోనాలుజరుగనున్న తరుణంలో ముందస్తు మీటింగ్ ఏర్పాటు చేశారు.

తెలంగాణ ఆత్మను ప్రతిబింబించేలా బోనాలు..

తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే మహోత్సవం బోనాల పండుగ నిర్వహించాలని అధికారులను మంత్రి పొన్నం ఆదేశించారు. గతంలో ఒకే కార్పోరేషన్ పరిధిలో ఆషాఢ బోనాలు నిర్వహించామని గుర్తు చేశారు. ఈ ఏడాది ఆషాఢ బోనాలను మూడు కార్పోరేషన్ల పరిధిలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నామని తెలిపారు. బోనాల పండుగకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి బోనాలను విజయవంతం చేయాలని కోరారు. భక్తులకు సౌకర్యాల కల్పనతో ఏ లోటూ రాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

గర్భిణులు, బాలింతల కోసం లాక్టేషన్ రూములు..

భక్తుల సౌకర్యార్థం దేవాదాయ శాఖ, జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ, రోడ్లు-భవనాల శాఖ, వాటర్ వర్క్స్, ఆర్టీసీ, రైల్వే, వైద్య ఆరోగ్య శాఖ, అగ్నిమాపక శాఖ, పర్యాటక శాఖ, సమాచార పౌరసంబంధాల శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా భారీ రద్దీ ఉండే దేవాలయాల వద్ద ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళికలు, అదనపు బస్సులు, వైద్య బృందాలు, భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. వృద్ధుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణులు, బాలింతల కోసం లాక్టేషన్ రూమ్ లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

రవాణా శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలి..

జూమ్ మీటింగ్ ద్వారా సమావేశంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ.. అధికారులకు కీలక సూచనలు చేశారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, మహిళల భక్తి, ప్రజల సామూహిక విశ్వాసాలకు ప్రతీక అని తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి బోనాల జాతర ఉత్సవాలను చూసేందుకు భక్తుల తరలివచ్చే పరిస్థితుల నేపథ్యంలో రవాణా శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాల నిర్వహణకు రూ. 20 కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్ నేతృత్వంలో ప్రతి యేడు లాగే ఈ యేడు బోనాల ఉత్సవాలను నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.

ఈ సమావేశంలో రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, దానం నాగేందర్, ప్రభుత్వ సలహాదారు గోవింద రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, డీజీపీ సీవీ ఆనంద్, మూడు మున్సిపాలిటీ కార్పొరేషన్ల కమిషనర్లు, సీపీలు, జిల్లా కలెక్టర్లు, వివిధ విభాగాల అధికారులు, ఉమ్మడి దేవాలయాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Read Also: కొత్తగా బాస్ స్కామ్.. పోలీసుల బిగ్ అలర్ట్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>