కలం, కరీంనగర్ బ్యూరో: ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ (Gunjapadugu Hariprasad) దుయ్యబట్టారు. ఈ మేరకు జులై 2న తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో చేపట్టిన భూ పోరాటం పోస్టర్‌ను బుధవారం కరీంనగర్ (Karimnagar) లోని జిల్లా కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ బోగే పద్మతో కలిసి ఆవిష్కరించారు.
అనంతరం విలేకరుల సమావేశంలో ఇరువురు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1969 నుండి ఇప్పటివరకు రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది తెలంగాణ ఉద్యమకారులు పాల్గొని కేసులపాలై లాఠీ దెబ్బలు తిని సర్వం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో త్యాగాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నప్పటికీ ఉద్యమ నాయకుడే రాష్ట్రాన్ని పాలించారని, కానీ జైలు పాలైన ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు కనీస గుర్తింపు లేదన్నారు.
సంక్షేమ పథకాలు వర్తిస్తాయనుకుని ఎదురుచూసిన ఉద్యమకారులకు గత ప్రభుత్వం పరిపాలించిన కాలంలో నిరాశే మిగిలిందన్నారు. కాగా తెలంగాణ ఉద్యమకారులను బీఆర్ఎస్ పాలనలో అడుగడుగున అవమానపరచడం మరువలేదన్నారు. తెలంగాణ ఉద్యమకారుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, పింఛన్ అందిస్తామని, అలాగే క్రియాశీలకంగా పనిచేసిన వారికి 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఈ వాగ్దానాలను పూర్తిగా నమ్మిన ఉద్యమకారులందరూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో అత్యంత కీలక పాత్ర పోషించారని అన్నారు.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలలో తెలంగాణ ఉద్యమకారుల పక్షాన ఇచ్చిన హామీ మేరకు పని చేస్తున్నట్లు కనిపించడం లేదన్నారు. ఈ విషయమై తెలంగాణ రక్షణ సమితి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (TRS Chief Kavitha) తెలంగాణ ఉద్యమకారులకు మద్దతుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఉద్యమకారులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ చైతన్య పరుస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారన్నారు.
కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో జాలే గుట్ట దగ్గర తెలంగాణ ఉద్యమకారుల కోసం భూ పోరాటానికి పూనుకొని ఒక నూతన పోరాటానికి కల్వకుంట్ల కవిత శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వంలో చలనం వచ్చినట్లే చేస్తూ కేకే కమిటీ పేరుతో ఒక కాలయాపన చేసే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఆ కమిటీతో తెలంగాణ ఉద్యమకారులకు ఒరిగేదేమీ లేదని, ఎలాంటి న్యాయం జరిగే అవకాశమే లేదని స్పష్టమవుతుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ఉద్యమకారులకు భూమి దక్కాలంటే కవితమ్మ భూ పోరాటం చేయక తప్పదన్నారు.
అన్ని జిల్లాల నుండి ఉద్యమకారులు హైదరాబాద్‌లోని ఉప్పల్ బాగయత్‌లో ఉన్న ప్రభుత్వ స్థలాలను ఉద్యమకారులు సొంతం చేసుకునేటటువంటి పోరాటానికి సిద్దమవుతున్నాయన్నారు. జులై 2న కవిత నాయకత్వంలో జరిగే మహా భూ పోరాటానికి కరీంనగర్ జిల్లాలో ఉన్న తెలంగాణ ఉద్యమకారులు, ఉద్యమ సంఘాల ప్రతినిధులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు అంకం శివరాణి, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల సురేష్, జంగ అపర్ణ, గర్షకుర్తి విద్యాసాగర్, రంగరవేణి లక్ష్మణ్ తెలంగాణ ఉద్యమకారుల JAC నాయకులు పోతు కనుకయ్య, బుస్స రవీందర్, అనంతగిరి సంపత్, అవుదుర్తి కళవతి, బోగే రాజేశ్వరి, దేవ అనసుర్య, చామణపల్లి చంద్రశేఖర్, నాగవెళ్లి నిర్మల తదితరులు పాల్గొన్నారు.
Read Also: కొత్తగా బాస్ స్కామ్.. పోలీసుల బిగ్ అలర్ట్
Follow Us On : WhatsApp

