కలం, వెబ్ డెస్క్: ముంబై (Mumbai) లోకల్ ట్రైన్‌లో డోర్ దగ్గర మొదలైన వివాదం యువకుడి హత్యకు దారి తీసింది. ప్రయాణికులంతా చూస్తుండగానే మయాంక్ లోహర్ అనే యువకుడిని రోషన్ సువర్ణ కత్తితో పొడిచి దారుణంగా చంపేశాడు. ఈ ఘటనతో అక్కడున్న వారు భయభ్రాంతులకు గురయ్యారు. ఇందుకు సంబంధించి వీడియో నెట్టింట వైరలవుతోంది.
21 ఏళ్ల మయాంక్ ముంబయి లోకల్ ట్రైన్‌లో చర్చిగేట్ నుంచి నల్లసోపారాకు వెళ్తున్నాడు. ఇదే సమయంలో రోషన్ సువర్ణ అనే వ్యక్తి కూడా ట్రైన్ ఎక్కి డోర్ వద్దకు వచ్చాడు. వర్షం పడుతుండటంతో డోర్ మూసివేసే విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహంతో రోషన్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా మయాంక్‌ను పొడవడంతో అక్కడికక్కడే మరణించాడు. అనంతరం అరుస్తూ, ప్రయాణికులను బెదిరిస్తూ అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ ఘటనతో కోచ్ మొత్తం రక్తసిక్తంగా మారడంతో జనాలు భయంతో కేకలు వేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హత్యకు పాల్పడిన రోషన్‌ను కుర్లా ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్లు బోరివాలీ రైల్వే పోలీస్ ఇన్ స్పెక్టర్ దత్తా కుప్రేకర్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.

