కలం, జోగులాంబ గద్వాల: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హరితహారం’ కార్యక్రమం లక్ష్యాలు గద్వాల (Gadwal) పట్టణంలో నీరుగారుతున్నాయి. పట్టణంలోని భీమ్ నగర్ పరిధిలో నాటిన చెట్లకు రక్షణ కరువైందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో కొన్ని, కొందరు వ్యాపారుల స్వార్థంతో మరికొన్ని చెట్లు నేలమట్టమవుతున్నాయి.
రోడ్డు పనుల క్రమంలో కూలిన చెట్లు
ఇటీవల గద్వాల పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు ఆక్రమణల తొలగింపు చేపట్టారు. రోడ్లు, డ్రైనేజీ కాలువలపై ఉన్న రేకుల షెడ్లను, డబ్బాలను తొలగించడం వరకు బాగానే ఉన్నా.. మున్సిపల్ సిబ్బంది బుల్డోజర్లతో రోడ్డును సరిచేసే క్రమంలో హరితహారం చెట్ల చుట్టూ ఉన్న మట్టిని పూర్తిగా తొలగించారు. వేర్లకు బలం లేకపోవడంతో గత నెలలో వీచిన ఈదురు గాలులకు పలు చెట్లు నేలకొరిగాయి. మరికొన్ని చెట్లు ఎప్పుడు కూలుతాయో తెలియని స్థితిలో ప్రమాదకరంగా మారాయి. మున్సిపల్ అధికారుల సమన్వయ లోపం వల్లే ఇలా జరుగుతోందని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.
స్వార్థం కోసం నరికివేత.. స్థానికుల ఆగ్రహం
ఇదిలా ఉండగా తాజాగా భీమ్ నగర్‌లో బాగా ఎదిగిన ఒక పెద్ద హరితహారం చెట్టును.. తన షాపునకు అడ్డంగా ఉందనే నెపంతో ఓ వ్యాపారి ఏకంగా నరికివేశాడు. ఎంతో కాలంగా కాపాడుకుంటూ వచ్చిన చెట్టును ఇలా నిర్దాక్షిణ్యంగా నరికివేయడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ప్రభుత్వ ఆశయాలకు తూట్లు పొడుస్తూ, పర్యావరణానికి నష్టం చేకూరుస్తున్న వారిపై మున్సిపల్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. నరికివేతకు గురైన ప్రాంతాల్లో తిరిగి మొక్కలు నాటడమే కాకుండా, మిగిలిన చెట్ల సంరక్షణకు తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలి” అని గద్వాల పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

