కలం, నిర్మల్ : ప్రభుత్వం అమలుపరుస్తున్న ప్రతి సంక్షేమ పథకం క్షేత్రస్థాయిలో పేదలందరికీ చేరాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఆకాంక్ష అని “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక” సమీక్ష ప్రత్యేక అధికారి ఇలంబర్తి (Ilambarthi) అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో 99 రోజుల ప్రణాళిక కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా 99 రోజుల ప్రణాళికలో శాఖల వారిగా చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించి ఫోటో గ్యాలరీని కలెక్టర్, అధికారులతో కలిసి తిలకించారు.
శాఖల వారిగా చేపట్టిన కార్యక్రమాల వివరాలు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ, అన్ని శాఖలు 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాలు అన్ని శాఖల అధికారులు విజయవంతంగా నిర్వహించారని ప్రశంసించారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ శాఖల వారీగా సంబంధిత పథకాలు, సంక్షేమ ఫలాలు అన్ని అట్టడుగు వర్గాల ప్రజలకు చేరే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. స్పష్టమైన ప్రణాళికతో ప్రజా పాలన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు.
అధికారులు వెల్లడించిన నివేదికలపై ఇలంబర్తి (Ilambarthi) సంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసు శాఖ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాల వల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయన్నారు. ఇన్నోవేటివ్ ఆలోచనలతో అధికారులు ముందుకు సాగాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్ లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, డిఎఫ్ఓ సుశాంత్ సుఖదేవ్ బోబడే, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, డిఆర్ఓ రాథోడ్ రమేష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Also: ఎల్ నినోను ఎదుర్కొందాం.. కరువును జయించే పంటలను పండిద్దాం!
Follow Us On: Sharechat

