కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ ఐటీ కారిడార్‌కు అత్యంత చేరువలో ఉన్న హైటెక్స్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న కబ్జాదారులపై హైడ్రా (HYDRAA) మరోసారి ఉక్కుపాదం మోపింది. ఖానామెట్ ప్రాంతంలోని అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని అధికారులు భారీ ఆపరేషన్ ద్వారా ఆక్రమణల నుంచి కాపాడారు.
ఖానామెట్ సర్వే నంబర్ 42 పరిధిలోని సుమారు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించి, అందులో తాత్కాలిక షెడ్లు, గదులు నిర్మించడమే కాకుండా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. బహిరంగ మార్కెట్‌లో ఈ భూమి విలువ సుమారు రూ.1000 కోట్ల పైమాటే ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించిన హైడ్రా (HYDRAA) అధికారులు బుధవారం క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు.
ఆక్రమణలు నిజమేనని నిర్ధారణ కావడంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. భూమిలో అక్రమంగా నిర్మించిన షెడ్లు, గదులను పూర్తిగా తొలగించారు. కబ్జాదారులు వేసిన పాత ఫెన్సింగ్‌ను పడగొట్టి, ఆ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ 5 ఎకరాల భూమి చుట్టూ ప్రభుత్వం తరపున కొత్తగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.
Read Also: కంచే చేను మేస్తే.. వరంగల్‌లో రెవెన్యూ అధికారి భూదందా!
Follow Us On: Instagram

