కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో కొద్ది రోజులుగా నడుస్తున్నలేఖల రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు సహా బీజేపీ, కాంగ్రెస్ నేతలు పలు అంశాలపై పోటాపోటీగా లేఖలు రాసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఓ లేఖ రాశారు. రేపు తుంగభద్ర ప్రాజెక్టు గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు, డీకే శివకుమార్‌లు ఒకే వేదికపై కలుసుకోనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు దక్కాల్సిన తుంగభద్ర జలాల వాటాపై హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టే కుట్రలు మానుకోవాలని హరీశ్ అన్నారు. తుంగభద్రపై కర్నాటక రాష్ట్ర నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలని, తుమ్మిళ్ల, బీమా, ఆర్డీఎస్ ప్రాజెక్టుల ప్రయోజనాలను కాపాడాలన్నారు. ఇప్పటికే గత సమైఖ్య పాలనలో తెలంగాణకు నీళ్ల విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని హరీశ్ రావు అన్నారు. కృష్ణా, గోదావరి జలాల దోపిడీతో ఎన్నో ఏళ్లు భూములు బీడుగా మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ హయాంలోనే కృష్ణా, గోదావరి జలాలను మళ్లించి తెలంగాణ భూములను పంటలతో సస్యశ్యామలం చేశామన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పక్క రాష్ట్రాల వద్ద తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టి ప్రమాదకర విధానాలు అవలంబిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి జలాలను ఏపీకి మళ్లించడంతో సీఎం రేవంత్ రెడ్డి సహకరిస్తున్నాడని ఆరోపించారు. అలాగే ఇప్పుడు తుంగభద్ర నదిపై కర్నాటక కట్టే ప్రాజెక్టుల విషయంలో కూడా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాడన్నారు. పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్ పాలమూరు రైతాంగాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారన్నారు. తెలంగాణ నీటిని తాకట్టు పెట్టే అధికారం సీఎంకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. పాలమూరు ప్రజలు నీటి హక్కుల కోసం మరోసారి ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని హరీశ్ రావు అన్నారు. సీఎం రేవంత్ కుట్ర పూరిత ప్రయత్నాలను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందని, తెలంగాణ జల హక్కులను కాపాడటంలో పోరాటం కొనసాగిస్తామని హరీశ్ రావు స్పష్టం చేశారు.

