Mobile Popup Ad
Mobile Popup Ad

ఆ నాలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నిక‌లు!

కలం, ఢిల్లీ బ్యూరో: దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) పుంజుకోవడంతో కేంద్రంలోని బీజేపీ (BJP) సర్కార్ అలర్ట్ అయింది. నార్త్ వైపు ఆ వేవ్ విస్తరించకుండా స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ముందస్తుగా (Early Assembly Polls) నిర్వహించేలా వ్యూహం రచిస్తున్నది. అందులో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా రాష్ట్రాలు ఉన్నాయి. వీటికి వచ్చే ఏడాది మార్చి తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. దాదాపు ఆరు నెలల ముందే నిర్వహించేలా పార్టీలో చర్చలు జరుగుతున్నట్లు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జోరందుకుంది.

జనగణన ప్రక్రియ కారణంగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వస్తున్నదని బీజేపీ స‌ర్కార్‌ పైకి చెప్పనుంది. అయితే.. ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ సమీకరణాలు, యాక్టివిటీస్ బలపడకముందే అంతా సెట్ చేయాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తున్నది. మణిపూర్‌లో సైతం వచ్చే ఏడాది మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.

అక్కడ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావించినా రాష్ట్రంలోని శాంతిభద్రతల సమస్య, స్థానిక అలజడి కారణంగా నిర్ణయాన్ని పక్కకు పెట్టినట్లు తెలుస్తున్నది. కేవలం పొలిటికల్ ఈక్వేషన్స్ కారణంగానే బీజేపీ ముందస్తు ఎన్నికల వైపు ఆలోచిస్తున్నట్లు జాతీయ రాజకీయాల్లో ప్రచారం చక్కర్లు కొడుతున్నది. ఇప్పటికే ఆ నాలుగు రాష్ట్రాల బీజేపీ స్టేట్ లీడర్‌షిప్‌ను పార్టీ అధిష్టానం అప్రమత్తం చేసింది.

వ్యూహాత్మకంగా..!

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకున్నది. అక్కడ హిందూ ఓటు బ్యాంక్ కన్సాలిడేషన్ సక్సెస్ అయిందన్నది పార్టీ బలంగా నమ్ముతున్నది. కేడర్‌లో, దేశవ్యాప్తంగానే ప్రజల్లో ఒక ఉత్సాహం, స్పష్టమైన మెసేజ్ బెంగాల్ ఫలితాలతో ఏర్పడిందన్న ధీమాలో బీజేపీ నేతలు ఉన్నారు. ఈ జోరులోనే నాలుగు రాష్ట్రాలకు కూడా ముందస్తు ఎన్నికలు జరిగితే అడ్వాంటేజ్‌ అవుతుందన్నది పార్టీ ఆలోచనగా తెలుస్తున్నది.

– ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదమేమీ లేకపోయినా కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్య బంధం బలపడే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకుని ఆ రెండు పార్టీలు క్షేత్రస్థాయిలో సన్నద్ధం కాకముందే, సంస్థాగతంగా ఏర్పాట్లు చేసుకోకముందే ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టాలన్నది బీజేపీ వ్యూహం. ఊహకు కూడా అందకుండా తమిళనాడులో టీవీకే, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరడం, కర్నాటకలో సంక్లిష్టమనుకున్న నాయకత్వ మార్పు సునాయాసంగా ఇంప్లిమెంట్ కావడం బీజేపీకి మింగుడుపడలేదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ విషయంలోనూ అలాంటి అనూహ్య పరిణామాలు జరగడానికి ముందే ఎన్నికలను పూర్తి చేయడం ఉత్తమమనేది బీజేపీ ఆలోచన.

– ఉత్తరప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలో ఉంది. తామే అధికారంలో ఉండటంతో ముందస్తుకు వెళ్లడం ఈజీ అని పార్టీ భావిస్తున్నది.

– పంజాబ్‌లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ పవర్‌లో ఉంది. అక్కడ కొన్నిరోజులుగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోవడంతో.. దాని ప్రభావం పంజాబ్‌పై పడింది. ఇక్కడ కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని బీజేపీ నేతలకు పార్టీ నుంచి మెసేజ్ వెళ్లినట్లు ఢిల్లీలో ప్రచారం జరుగుతున్నది.

సెన్సస్ సాకుతో మాస్టర్ స్ట్రోక్!

సెన్సస్ ప్రక్రియలో ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమైనందున వచ్చే ఏడాది మార్చి నెలలోపు అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ వీలు పడదనే కారణాన్ని బీజేపీ ప్రస్తావిస్తున్నది. జనగణన ఫస్ట్ ఫేజ్ దాదాపుగా దేశమంతా పూర్తయినా కీలకమైన సెకండ్ ఫేజ్ ఫిబ్రవరిలో జరగనున్నది. కానీ దీనికి ముందు, తర్వాత ప్రీ, పోస్ట్ ఎక్సర్‌సైజ్ ఉంటున్నందున అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ సిబ్బందిని సమకూర్చుకోవడంలో ఉన్న చిక్కులను ప్రస్తావిస్తూ ఆ నాలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికల కసరత్తు మొదలైంది.

నిజానికి ‘ముందస్తు ఎన్నికలపై బీజేపీకి భిన్నాభిప్రాయాలే ఉన్నాయి. వాజ్‌పేయ్ హయాంలో 2004 అక్టోబర్లో జరగాల్సిన పార్లమెంట్ ఎన్నికలు మార్చి-ఏప్రిల్ నెలల్లోనే వచ్చేశాయి. లోక్‌సభకు ఆ ఏడాది అక్టోబర్ వరకూ గడువు ఉన్నా ఫిబ్రవరిలోనే రద్దు చేశారు. నాడు ‘ఇండియా షైనింగ్’ అనే నినాదంతో ముందస్తుకు వెళ్లిన బీజేపీ.. తీరా అధికారాన్ని పోగొట్టుకున్నది.

ఇప్పుడు ఈ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ‘ముందస్తు’కు సైతం ఆ అనుభవాలను పరిగణనలోకి తీసుకుని.. ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తున్నది. మణిపూర్‌లో ఉద్రిక్త పరిస్థితుల రీత్యా ఆ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉండకపోవచ్చని బీజేపీ కేంద్ర వర్గాలు అంటున్నా.. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ ఏడాది చివర్లోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

స్టేట్ లీడర్లకు అలర్ట్ మెసేజ్

– ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ నాలుగు రాష్ట్రాల బీజేపీ యూనిట్లకు అధిష్టానం సంకేతాలు పంపింది. వచ్చే ఏడాది సమ్మర్ టైమ్‌లో షెడ్యూలు ప్రకారం జరగకపోవచ్చని, ముందుగానే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని హైకమాండ్ సూచన చేసింది. ఆయా రాష్ట్రాల్లోని కోర్ కమిటీలకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లినట్లు బీజేపీ కేంద్ర వర్గాల సమాచారం. ఎన్నికల సంసిద్ధతను స్పీడప్ చేయాలని సూచించింది.
– ఉత్తరాఖండ్ బీజేపీ స్టేట్ యూనిట్ సైతం ముందస్తుగానే ఎన్నికలు నిర్వహిస్తే మంచిదనే అభిప్రాయాన్ని ఓపెన్‌గానే వ్యక్తం చేసింది.
– ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉండటంతో.. ముందస్తుకు ఎలాంటి ఆటంకాలు ఉండబోవు.
– పంజాబ్‌లో మాత్రం ఆప్ అధికారంలో ఉండటంతో.. ముందస్తుకు వెళ్లడం అక్కడ ప్రభుత్వం స్పందించే దానిపై ఉంటుందన్న చర్చ కూడా జరుగుతున్నది.

4 రాష్ట్రాల్లో ప్రత్యేక పరిస్థితులు

– ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందనుకుంటున్న నాలుగు రాష్ట్రాలకు వేర్వేరు ప్రత్యేకతలు ఉన్నాయి.
– ఉత్తరప్రదేశ్‌లో నిరుద్యోగం, రైతు సమస్యలు, ఎల్‌ నినో ప్రభావం, దళిత-ఓబీసీ ఈక్వేషన్ వంటి పలు అంశాలు బీజేపీని వెంటాడుతున్నాయి. దీనికి తోడు కాంగ్రెస్‌-సమాజ్‌వాదీ పార్టీ మధ్య బంధం బలపడడం, మెరుగైన సమన్వయం కుదరొచ్చన్న అనుమానమూ బీజేపీకి లేకపోలేదు.
– పంజాబ్‌లో బీజేపీ బలహీనంగా ఉండడంతో పాటు ‘ఆప్’ అనుకున్నంతగా వీక్ కాకపోవడం, కాంగ్రెస్‌తో ఆ పార్టీకి గ్యాప్ విస్తృతం కాకపోవడం ఒక అంశం. ఈ రెండు పార్టీల మధ్య కాంబినేషన్ కుదిరితే బీజేపీ మరింత వీక్ అయ్యే అవకాశం ఉంది.
– ఉత్తరాఖండ్‌లో బీజేపీ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత లేకపోయినా ఉద్యోగ నియామకాల్లో వివాదాలు, పర్వత ప్రాంత ప్రజల్లో అసంతృప్తి ఒక కారణం.
– గోవాలో కూటమి రాజకీయాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఎన్నికలు ఆలస్యమైనా కొద్దీ కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల మధ్య సంబంధం మెరుగుపడుతుందన్నది బీజేపీ భావన.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>