కలం, వెబ్ డెస్క్: రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ పెద్ది (Peddi). జూన్ ప్రారంభంలో విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ సంపాదించుకొని నటుడిగా చరణ్‌ను మరో మెట్టు పైకి ఎక్కించింది. ఈ మూవీ సక్సెస్ మీట్‌ను శిల్పకళా వేదికలో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్ది టీంను పొగడ్తలతో ముంచెత్తారు. ముఖ్యంగా రామ్ చరణ్‌ను ఆకాశానికి ఎత్తేశారు. పెద్ది లాంటి సినిమాలు రావాలని, ఫిల్మ్ ఇండస్ట్రీకి, సొసైటీకి ఇలాంటి సినిమాలు ఎంతో అవసరమని ఆయన చెప్పారు.
రామ్ చరణ్ గోల్డెన్ స్పూన్‌తో పుట్టాడని, అసలు సినిమాల కోసం ఇంతగా కష్టపడాల్సిన అవసరం లేకపోయినా చాలా కష్టపడుతున్నాడని అన్నారు. రామ్ చరణ్ అవార్డ్ విన్నింగ్ యాక్టింగ్ చేశాడంటూ అందరూ చెప్తుంటే చాలా గర్వంగా ఉందని అన్నారు. అయితే అవార్డులు రావాలంటే ఎన్నో మార్గాలు ఉంటాయని, అవార్డు వచ్చినా, రాకపోయినా అందరి ప్రశంసలు అంతకంటే గొప్ప సంతోషాన్ని ఇస్తున్నాయని చెప్పారు.
ఈ సినిమా చూసిన వాళ్లకు రామ్ చరణ్ ఎక్కడా కనిపించడు అని, పెద్ది అనే క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుందని చిరంజీవి తెలిపారు. డైరెక్టర్ బుచ్చి బాబుపై మెగాస్టార్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇలాంటి కథను రామ్ చరణ్‌కు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి మరెన్నో మంచి కథలతో సినిమాలు తీసి మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు.
ఇదే వేదికపై చిరంజీవి (Chiranjeevi) మరో ఆసక్తికర కామెంట్ చేశారు. ఇప్పటికే మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్స్ ఉన్న రామ్ చరణ్‌కు కొత్త స్టార్ ట్యాగ్ ప్రకటించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు రామ్ చరణ్‌ను న్యూ ఏజ్ మెగాస్టార్ (New Age Megastar) అని సంబోధించారని చెప్పారు. చరణ్ ఇలా దేశ వ్యాప్తంగా పేరు సంపాదిస్తుంటే చాలా గర్వంగా ఉందన్నారు. ఇప్పటి నుంచి చరణ్ ముందు ఉండి, నేను వెనుక ఉండటమే కరెక్ట్ అని అన్నారు. దీనికి స్పందిస్తూ పక్కనే ఉన్న చరణ్ ఓ అడుగు వెనక్కి వేసి నవ్వేశాడు.
Read Also: మన జట్టు లేకపోయినా.. తగ్గని ఫిఫా క్రేజ్!
Follow Us On: Instagram

