కలం, వెబ్ డెస్క్ : నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలోనూ వర్షాలు (Rain Alert) ముంచెత్తుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న కొన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 28వ తేదీ వరకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఇక రేపటి విషయానికి వస్తే ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేశారు. వర్షంతో పాటు గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో కూడా ఈ రోజు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరాంధ్ర, కోస్తా తీర ప్రాంతాలైన విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం ప్రాంతాలతో పాటు పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉంది. రాయలసీమ పరిధిలోని కడప, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే (Rain Alert) అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
మరోవైపు దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. నగరంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా సియాన్ సబ్ వే పూర్తిగా నీట మునగడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంబైలో సగటున 56 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు గుర్తించారు. రానున్న మరో 24 గంటల పాటు నగరంలో వర్షాలు ఇలాగే కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.

