కలం, వెబ్ డెస్క్: దేశంలో వరుస అగ్ని ప్రమాదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల లక్నో, వైజాగ్‌లో జరిగిన ఘటనలు మరువక ముందే ఢిల్లీలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీ (Delhi)లోని ఉద్యోగ భవన్ (Udyog Bhawan) సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఒక ఎలక్ట్రిక్ ప్యానెల్‌లో మంటలు చెలరేగాయి. అవి పక్కనే ఉన్న స్లమ్‌లోని కార్మికుల తాత్కాలిక గుడిసెలకు వ్యాపించాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ఢిల్లీ ఫైర్ సర్వీస్ సిబ్బంది 20 అగ్ని మాపక యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అగ్ని మాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించగా ఉదయం 5 గంటల వరకు మంటలను అన్ని వైపుల నుండి అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ప్రమాదంలో ఎవరికైనా గాయాలు అయ్యాయా? ఆస్తి నష్టం ఎంత మేరకు జరిగింది అనే వివరాలు తెలియాల్సి ఉంది.

