కలం, కరీంనగర్ బ్యూరో: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో కరీంనగర్ (Karimnagar) జిల్లాను రాష్ట్రానికి ఆదర్శంగా నిలపాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. పకడ్బందీగా, పారదర్శకంగా ఓటరు జాబితా రూపొందించేందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. మంగళవారం రాత్రి రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు బీఎల్‌వోలు ఇంటింటి సందర్శన చేపట్టి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తారని తెలిపారు.
బీఎల్‌ఏలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి సహకారం అందించి అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. జులై 24న పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ, 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ, జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ, సెప్టెంబర్ 28 వరకు అభ్యంతరాల పరిష్కారం చేపట్టి అక్టోబర్ ఒకటో తేదీన తుది ఓటరు జాబితా ప్రచురించనున్నట్లు వెల్లడించారు.
బీఎల్‌వోలు ఇంటింటి సర్వే సందర్భంగా ప్రతి ఓటరుకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తారని కలెక్టర్ చిత్రా మిశ్రా వివరించారు. ఫారం అందని వారు లేదా పొరపాటున జాబితాలో చేరని అర్హులైన ఓటర్లను గుర్తించి నమోదు చేయించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. బీఎల్‌వోలు, బీఎల్‌ఏ సూపర్వైజర్లు, ప్రత్యేక అధికారులు నెల రోజులపాటు క్షేత్రస్థాయిలో పనిచేస్తారని తెలిపారు. బిఎల్వోలు, బిఎల్ఏలకు పూర్తిస్థాయిలో సర్ కార్యక్రమంపై అవగాహన పెంపొందిస్తామన్నారు.
ఒక్క ఓటరుని కూడా తొలగించబోం..
కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారమే సర్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఎలాంటి అపోహలకు తావులేదని కలెక్టర్ చిత్రా మిశ్రా స్పష్టం చేశారు. అర్హత కలిగిన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మినహాయించబోరని, అనర్హుల జాబితాలో చేరకుండా చర్యలు తీసుకోవడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఓటర్ల మార్పులు, చేర్పుల కోసం ఫారం-8, కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం-6 వినియోగించాలని సూచించారు. సర్ కార్యక్రమంపై మాస్టర్ ట్రైనర్ సంపత్ పార్టీల నేతలకు అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్వో స్వామి, ఆర్డీవోలు షర్మిల, జలకుమారితో పాటు కాంగ్రెస్ నేత సిరాజ్ హుస్సేన్, బీఆర్ఎస్ నేత సత్తినేని శ్రీనివాస్, బీజేపీ నేత నాంపల్లి శ్రీనివాస్, ఎంఐఎం నాయకులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ అబ్బాస్ షమీ, కార్పొరేటర్ మజీద్ హుస్సేన్, సీపీఎం కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి, టీడీపీ నేత ఎర్రవెల్లి రవీందర్, బీఎస్పీ నేత సిరిసిల్ల అంజయ్య పాల్గొన్నారు.

