కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరారు. ఈ పర్యటనలో ప్రధానంగా మెట్రో అంశంపై ఇద్దరు కేంద్ర మంత్రులను కలిసి కీలక చర్చలు జరిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)తో కలిసి సోమవారం రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. సుమారు రెండు గంటల పాటు ఈ సమావేశం కొనసాగడం గమనార్హం. మెట్రో ఫేజ్–1 కి సంబంధించి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవ్వాల్సిన రూ.13 వేల కోట్ల రుణంపై ప్రధానంగా చర్చ జరిపారు. రుణం ఆగిపోవడం వలన కలుగుతున్న ఇబ్బందులు, హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ విస్తరించాల్సిన ఆవశ్యకత తదితర అంశాలను పూర్తిగా వివరించారు.
ఫలప్రదంగా ముగిసిన పర్యటన..
ఈ రోజు ఉదయం కిషన్ రెడ్డితో కలిసి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమావేశమయ్యారు. ఈ భేటీలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్- I వాల్యూయేషన్, స్వాధీనానికి అవసరమైన రుణ సేకరణతో పాటు మెట్రో రెండో దశ విస్తరణ, నిర్మాణ వ్యయంపై ముగ్గురు కలిసి చర్చించారు.
ఈ సందర్భంగా ఈ అంశాలపై పూర్తిగా అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్‌ను నియమించాలని భావించారు. ఇందుకు SBICAPSని ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ (Gandhi Sarovar Project) కోసం రక్షణ శాఖ భూములు బదలాయించడానికి అంగీకరించినందుకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణంపై కూడా చర్చించారు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఫలప్రదంగా ముగిసిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Read Also: తల్లులైనా ఆట ఆగొద్దు: ఐసీసీ కొత్త రూల్స్!
Follow Us On : WhatsApp

