కలం, వెబ్ డెస్క్ : భారతదేశంలో స్వచ్ఛంద సంస్థలు (NGOs) పొందే విదేశీ నిధుల నియంత్రణకు సంబంధించి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం నిబంధనలు (FCRA Rules) 2011 సవరణలను అధికారిక గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నూతన నిబంధనల ప్రకారం విదేశీ నిధులు పొందే సంస్థల జవాబుదారీతనాన్ని మరింత పెంచేలా నిబంధనలను కఠినతరం చేశారు.
ఈ సవరణలలో అత్యంత కీలకమైన మార్పు మతాంతర మార్పిడిల (Proselytisation) నియంత్రణకు సంబంధించింది. ఎఫ్‌సిఆర్‌ఎ కింద నిధులు పొందేందుకు దరఖాస్తు చేసుకునే సంస్థలు మతపరమైన విద్య, సంప్రదాయాల పరిరక్షణ, స్థానిక నమ్మకాల రక్షణ వంటి కార్యక్రమాలను నిర్వహించవచ్చని పేర్కొంటూనే, అందులో స్పష్టంగా మతాంతర మార్పిడి కార్యక్రమాలను మినహాయిస్తున్నట్లు నిబంధనలలో పొందుపరిచారు. మతమార్పిడి కార్యకలాపాలకు విదేశీ నిధులను ఉపయోగించడంపై ఈ నిబంధనల ద్వారా పూర్తి నిషేధం విధించారు.
కొత్త నిబంధనల ప్రకారం విదేశీ నిధులు ఆశించే ప్రతి ఎన్‌జిఓ తాము ఏ నిర్దిష్ట ప్రయోజనం కోసం నిధులను సేకరిస్తున్నామో, ఏ రాష్ట్రంలో లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఆయా కార్యక్రమాలను నిర్వహించబోతున్నామో స్పష్టంగా దరఖాస్తులో పేర్కొనాల్సి ఉంటుంది. మునుపటిలా కాకుండా ప్రభుత్వం ముందే నిర్ణయించిన జాబితా నుండి మాత్రమే ప్రయోజనాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. గతంలో రిజిస్ట్రేషన్ పొందిన పాత సంస్థలు కూడా రాబోయే ఏడాది కాలంలో తాము ఏయే రాష్ట్రాల్లో ఏయే సేవల కోసం ఈ నిధులు ఉపయోగించాలనుకుంటున్నారో ప్రభుత్వానికి పత్రాల ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది.
నిర్వహణ యంత్రాంగం, పర్యవేక్షణలో కూడా ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. సంస్థల కీలక బాధ్యతల్లో (Key Functionary) భారత సంతతికి చెందిన వారు కాకుండా ఇతర విదేశీ పౌరులు ఉంటే, సాధారణంగా అలాంటి సంస్థలకు ఎఫ్‌సిఆర్‌ఎ (FCRA) అనుమతులు నిరాకరిస్తారు. ఒకవేళ ప్రత్యేక పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే తప్ప వీరికి నిధుల సేకరణ సాధ్యం కాదు. అలాగే కీలక బాధ్యులు అనే పదానికి పరిధిని విస్తరిస్తూ కంపెనీల డైరెక్టర్లు, ట్రస్టీలు, భాగస్వాములు, హిందూ అవిభక్త కుటుంబాల కర్తలను కూడా దీని పరిధిలోకి చేర్చారు.
సోషల్ మీడి ఖాతాల వివరాలు కూడా..
పారదర్శకతను పెంచే క్రమంలో సంస్థలు తమ సామాజిక మాధ్యమాల (Social Media) ఖాతాల వివరాలను కూడా ప్రభుత్వానికి సమర్పించడాన్ని తప్పనిసరి చేశారు. మధ్యవర్తిత్వ సంస్థలు లేదా డోనర్ అడ్వైజ్డ్ ఫండ్స్ ద్వారా వచ్చే విరాళాల విషయంలో అసలు దాత (Ultimate Donor) ఎవరు అనే విషయాన్ని ఖచ్చితంగా వెల్లడించాలి. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు క్షేత్రస్థాయి పరిశీలన (Field Verification) కూడా నిర్వహించనున్నారు. ఒక విడత నిధులు పొందిన తర్వాత, తదుపరి విడత విడుదల కావాలంటే అంతకుముందు వచ్చిన నిధులలో కనీసం 75 శాతం నిధులను వినియోగించి ఉండాలి.
ఇక నిష్క్రియంగా ఉన్న లేదా ఎలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించని డోర్మెంట్ (Dormant) సంస్థలను అడ్డుకోవడానికి ప్రత్యేక నిబంధన తెచ్చారు. గత రెండు ఆర్థిక సంవత్సరాలలో కనీసం 10 లక్షల రూపాయల విదేశీ విరాళాలను ఎంపిక చేసుకున్న సేవా రంగాల్లో ఖర్చు చేయని సంస్థలు తమ లైసెన్సులను కోల్పోయే ప్రమాదం ఉంది. వార్షిక నివేదికలతో పాటు పూర్తిస్థాయి సేవా నివేదికను సమర్పించడం, వార్తా ప్రసారాలు లేదా కరెంట్ అఫైర్స్ ప్రచురణలపై ఉన్న నిషేధాన్ని కొనసాగించడం వంటి నిబంధనల ద్వారా దేశీయ అంతర్గత భద్రత మరియు సాంస్కృతిక ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ మార్పులను (FCRA Rules) అమలులోకి తెచ్చింది.
Read Also: ఇండియా ఇష్టం లేదు.. డబ్బులొస్తే వెళ్లిపోతా: కాక్రోచ్ పార్టీ క్యాంపైనర్
Follow Us On: X(Twitter)

