Mobile Popup Ad
Mobile Popup Ad

కొత్తగూడెం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌కు కొత్త ఊపు

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లా ప్రజల దశాబ్దాల కాలంగా ఉన్న విమానాశ్రయ కల త్వరలోనే సాకారం కానున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కొత్తగూడెం సమీపంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ (Greenfield Airport) నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కొత్త ప్రతిపాదనలు సమర్పించింది. మంగళవారం ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే. రాంమోహన్ నాయుడును (Ram Mohan Naidu) రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రతిపాదిత ఎయిర్‌పోర్ట్ స్థాపనపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రం ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించి తొలి ఫీజిబిలిటీ సర్వే చేపట్టించినందుకు కేంద్ర మంత్రికి తుమ్మల నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు.

ఫీజిబిలిటీ సర్వేలో మొదట ఎంపిక చేసిన స్థలంలో ఎలక్ట్రిక్ లైన్లు, సమీపంలో ఎత్తైన కొండలు ఉండటం వల్ల విమాన రాకపోకలకు ఇబ్బందులు కలిగే అవకాశముందని అధికారులు నివేదించారు. దీంతో ప్రత్యామ్నాయ స్థలాన్ని ఎంపిక చేయాలని సూచించారు. వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం మరో అనుకూల స్థలాన్ని గుర్తించి, ఆ స్థలంపై కొత్త ఫీజిబిలిటీ స్టడీ బాధ్యతలను సంబంధిత ఏవియేషన్ సంస్థకు అప్పగించింది. ఈ నివేదిక త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ నివేదిక ఆధారంగా కొత్త స్థలాన్ని పరిశీలించేందుకు ఉన్నతాధికారుల బృందాన్ని త్వరితగతిన పంపించాలని కేంద్ర మంత్రిని రాష్ట్ర మంత్రులు కోరారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రాముఖ్యతను వారు వివరించారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని, ఎయిర్‌పోర్ట్ నిర్మాణంతో దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు మరింత సౌలభ్యం కలుగుతుందని తెలిపారు.

అదేవిధంగా సింగరేణి బొగ్గు గనులు, మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్, ఐటీసీ, బీపీఎల్ వంటి పరిశ్రమలతో ఈ జిల్లా పారిశ్రామికంగా కీలక స్థానం సంపాదించిందని చెప్పారు. అరుదైన ఖనిజ సంపద, విస్తారమైన అటవీ ప్రాంతాలతో ఎకో టూరిజానికి కూడా ఇది ప్రధాన కేంద్రంగా నిలిచిందని పేర్కొన్నారు. దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కూడా కొత్తగూడెంలో ఏర్పాటు చేయబడిందని గుర్తుచేశారు. ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం పూర్తయితే పారిశ్రామిక, విద్యా, పర్యాటక రంగాలలో జిల్లాకు మరింత పురోగతి సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌కు పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి రాంమోహన్ నాయుడు ప్రత్యేక చొరవతో ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ కల త్వరలోనే నిజమవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>