Mobile Popup Ad
Mobile Popup Ad

పీఎంజే దోపిడీ కేసులో మరింత పురోగతి.. మరో ఇద్దరు అరెస్ట్

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ పట్టణంలోని పీఎంజే (PMJ) జ్యువెలరీ షోరూంలో (PMJ Jewellery Robbery) మే 3న జరిగిన సంచలన సాయుధ దోపిడీ కేసులో జిల్లా పోలీసులు మరో కీలక పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేయడంతోపాటు వారి నుంచి కీలకమైన ఆధారాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ (సీపీ) తెలిపారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య 8కి చేరింది. కాగా ఈ నెల 17వ తేదీన కోర్టు అనుమతితో ఆరు రోజుల పోలీస్ కస్టడీలోకి తీసుకున్న ఐదుగురు ముఖ్య నిందితుల (A1 సుబోధ్ సింగ్, A2 రఘునాథ్, A3 రావిష్, A10 అమర్ సింగ్, A11జైనుల్లాబ్దీన్) కస్టడీ రేపటితో ముగియనుంది. కస్టడీ విచారణలో భాగంగా నిందితుడు రఘునాథ్ ఇచ్చిన సమాచారం మేరకు.. నేరానికి ఉపయోగించిన టీవీఎస్ అపాచీ (TVS Apache) బైక్‌ను మహారాష్ట్రలోని బల్లార్షా రైల్వే స్టేషన్ సమీపం నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఏడో నిందితుడి అరెస్ట్, పిస్టల్ స్వాధీనం

షోరూంలో కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడిన ఐదుగురిలో ఇప్పటికే ఇద్దరు అరెస్ట్ కాగా, తాజాగా మూడో వ్యక్తి అయిన సూర్యమణి @ సనోజ్ కుమార్ (21) ను కరీంనగర్ శివారులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా వచ్చిన సమాచారం ఆధారంగా.. రామడుగు మండల శివారులోని ఎస్ఆర్ఎస్పి (SRSP) కెనాల్ వద్ద గల తాత్కాలిక నిర్మాణ షెడ్ల సమీపంలో కీలక ఆధారాలు సేకరించారు. నేరం జరిగిన రోజు నిందితులు ధరించిన 5 జతల దుస్తులు, 3 జతల బూట్లు, మూడు నకిలీ టూ వీలర్ ఆర్‌సి (RC) కార్డులు, రెడ్ మి మొబైల్ ఫోన్, అక్కడే దాచి ఉంచిన ఒక పిస్టల్ (Pistol), ఒక మ్యాగజైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బీహార్‌లో 8వ నిందితుడి అరెస్ట్

ఈ కేసుతో సంబంధం ఉన్న మరో కీలక నిందితుడు ఎం.డి. ఆదిల్ ఖాన్ ను బీహార్ రాష్ట్రం పాట్నాలోని పుల్వారి షరీఫ్ వద్ద కరీంనగర్ ప్రత్యేక పోలీస్ బృందం అరెస్ట్ చేసింది. ఇతడిని తెలంగాణకు తరలించేందుకు స్థానిక కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ దాఖలు చేసినట్లు సీపీ తెలిపారు. గతంలో అరెస్ట్ అయిన క్రెటా కార్ డ్రైవర్ జైనులబ్దీన్ కు నేరానికి సహకరించేందుకు ఈ ఆదిల్ ఖానే క్రెటా కారును, నిందితులకు తుపాకులను సరఫరా చేసినట్లు విచారణలో తేలింది. A12 మహమ్మద్ మెహతాబ్ ఖాన్ నిందితులకు సిమ్ కార్డులు అందించినందుకు గాను అరెస్ట్ కాబడి జైలులో ఉన్నాడు. ఈ నిందితుడిని పోలీసు కస్టడీకి తీసుకోలేదని పేర్కొన్నారు. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిందితులను చాకచక్యంగా పట్టుకున్న కరీంనగర్ అడిషనల్ డీసీపీ వెంకటటరమణ, టౌన్ ఏసీపీ వెంకటస్వామి, ఇన్స్పెక్టర్లు సృజన్ రెడ్డి,బొల్లం రమేష్, బగ్గని శ్రీనివాస్, తిరుమల్, ప్రకాష్, ఎస్సై శేఖర్ మరియు ఇతర పోలీసు అధికారులను, సిబ్బందిని సీపీ అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>