Mobile Popup Ad
Mobile Popup Ad

నకిరేకల్‌లో మందుబాబులు వీరంగం.. సామాన్యులపై జులుం

కలం, నకిరేకల్: జేబు నిండా డబ్బు, చేతిలో ఖరీదైన కారు ఉంటే చాలు.. సమాజంతో మాకు పనిలేదు, చట్టాలు మాకు చుట్టాలు అనే అహంకార ధోరణి నకిరేకల్‌లో (Nakrekal)  నడిరోడ్డుపై ప్రత్యక్షమైంది. ప్రజలు ప్రయాణించాల్సిన రహదారులను కొందరు విలాసవంతమైన ఓపెన్ బార్‌లుగా (Open Bars) మార్చేస్తుండటం స్థానికంగా కలకలం రేపుతోంది. పద్ధతి మార్చుకోవాలని చెప్పిన సామాన్య జనంపైనే ‘టాక్సులు కడుతున్నాం’ అంటూ తిరగబడుతుండటం విస్మయానికి గురిచేస్తోంది. స్థానికుల వివరాల ప్రకారం.. నకిరేకల్ పట్టణ పరిధిలోని ఒక ప్రధాన రహదారిపై కొందరు యువకులు మహీంద్రా థార్ వాహనాన్ని అడ్డంగా నిలిపారు. కారు బానెట్‌నే బార్ కౌంటర్‌గా మార్చేసి, గ్లాసుల్లో మద్యం పోసుకుంటూ దాదాపు అరగంట పాటు బహిరంగంగా రచ్చ చేశారు. దీనివల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో ప్రయాణికులు, స్థానికులు వారిని ప్రశ్నించారు. సరిగ్గా ఇక్కడే సదరు మందుబాబుల అహంకారం బట్టబయలైంది.

‘మేం రోడ్డు ట్యాక్స్‌లు, వెహికల్ ట్యాక్స్‌లు కడుతున్నాం.. కారు ఎక్కడైనా ఆపుతాం.. తాగుతాం.. మీకేంటి?’ అంటూ ఎదురుదాడికి దిగారు. అభ్యంతరం వ్యక్తం చేసిన వారిని బెదిరిస్తూ.. రోడ్డు తమ సొంత ఆస్తి అన్నట్లుగా వ్యవహరించడం అక్కడి వారిని షాక్‌కు గురిచేసింది. నకిరేకల్‌లో ఇలాంటి ఘోరాలు ఒక్క చోటే కాదు. పట్టణంలోని పలు ప్రాంతాలు బహిరంగ మద్యపానానికి అడ్డాగా మారాయని స్థానికులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో ఈ ప్రాంతాలన్నీ మందుబాబుల చేతుల్లోకి వెళ్తున్నాయని, కనీసం నడిచే పరిస్థితి కూడా ఉండటం లేదని మహిళలు, పాదచారులు వాపోతున్నారు. మద్యం మత్తులో ఊగే ఈ వికృత చేష్టలు ఘోర రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇంత జరుగుతున్నా స్థానిక పోలీసుల పెట్రోలింగ్ వాహనాల జాడ ఎక్కడ? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పట్టణంలో ఓపెన్ బార్ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలంటున్నారు. కఠినమైన నిఘా ఏర్పాటు చేసి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నకిరేకల్ ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>