కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు విధ్యా మాఫియా విధానాన్ని కొనసాగిస్తూ.. పేద ప్రజలను నిలువునా దోచుకుంటున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకత్వ పిలుపుమేరకు జిల్లా బీఆర్ఎస్వీ విభాగం (Karimnagar BRSV) ఆధ్వర్యంలో “విద్య వ్యవస్థల్లో నెలకొన్న అవస్థలు.. వాటిపై మీ స్పందన”అనే పేరుతో ప్రత్యేక వినతి పత్రాన్ని నేడు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్వీ నేతలతో కలిసి జిల్లా విద్యాధికారిని కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలో జరుగుతున్న దోపిడీని డీఈఓ దృష్టికి తీసుకెళ్లారు.
పేదవాళ్ళను దండుకుంటున్నారు..
నోటు పుస్తకాలు, యూనిఫార్మ్స్, స్టేషనరీ పేరుతో పేదవాళ్ళను దండుకుంటున్నారని.. వీటిని అరికట్టాల్సిందిగా డీఈఓకు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా డిఫెన్స్ అకాడమీ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంస్థలు నడుపుతున్నారని చెప్పారు. వీటి పైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పొన్నం అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రైవేటు విద్యాసంస్థల్లో ఒక మాఫియా కొనసాగుతుందని అన్నారు. విద్యార్థుల ద్వారా డబ్బులు దండుకొని కేవలం రెండు మూడేళ్లలోనే కోటీశ్వరులు అవుతున్నారని.. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలలు నడుపుతున్నారని చెప్పారు. నోటు పుస్తకాలు, యూనిఫార్మ్స్, ఇలా ఎన్నో రకాలుగా విద్యార్థులను దోచుకుంటున్నారని.. వారికి ఎలాంటి స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అవినీతిని డిఈవో దృష్టికి తీసుకువస్తాం..
రానున్న రెండు రోజుల్లో ఏ ఏ పాఠశాలలో ఎంత స్థాయిలో పుస్తక నిల్వలు ఉన్నాయో అవి ఎక్కడెక్కడ నిలువలు చేశారో వాటి సమగ్రమైన వివరాలతో కూడిన పత్రాలను డీఈఓకు అందజేస్తామని తెలిపారు. వీటన్నింటిపైన డీఈవో సానుకూలంగా స్పందించారని.. వారిపై తమకు విశ్వాసం ఉందన్నారు. ఎప్పటికప్పుడు ప్రైవేటు పాఠశాలలో జరుగుతున్న అవినీతిని డిఈవో దృష్టికి తీసుకువస్తామని.. వాటికి వారు పరిష్కరిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నామన్నారు. ఒకవేళ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోతే.. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎలాంటి ఉద్యమైతే శాంతియుతంగా చేసామో అలాంటి ఉద్యమము మళ్లీ చేపడతామన్నారు. అయినా కూడా స్పందించకపోతే విద్యాసంస్థలపై దాడులకు కూడా వెనకాడబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
విద్యాశాఖకు ఇప్పటి వరకు మంత్రి లేకపోవడం బాధాకరం అని ఆయన అన్నారు. దాంతోపాటు జర్నలిస్టుల పిల్లలకు పాఠశాల స్థాయిలో 100% ఫీజులో రాయితీ కల్పించాలని డీఈఓను కోరారు. వారు వెంటనే స్పందించి ఇది వరకే ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో 100% రైతు కల్పించాలని ఇదివరకే ఆర్డర్లు జారీ చేశామని డీఈఓ చెప్పారు. వాటిని ఎవరైనా ఉల్లంఘించినట్టు తమ దృష్టికి తీసుకువస్తే ఆ పాఠశాలపై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకుంటామని డీఈఓ తెలిపారని పొన్నం అనిల్ పేర్కొన్నారు. జర్నలిస్ట్ పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో రాయితీ 100% రాయితీ కల్పించే వరకు జర్నలిస్టులకు అండగా బీఆర్ఎస్వీ ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ తో పాటు బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ ధ్యాస మధుసూదన్ రెడ్డి, శాతవాహన విశ్వవిద్యాలయం బీఆర్ఎస్వీ ఇంచార్జ్ చుక్క శ్రీనివాస్, నగర అధ్యక్షుడు బొంకూరి మోహన్, రాష్ట్ర నాయకులు పటేల్ శ్రవణ్ రెడ్డి, ఆరే రవి గౌడ్, సోమిరెడ్డి రాజా నరేష్ రెడ్డి, పొన్నం శ్రీకాంత్ గౌడ్, రవి నాయక్ మున్నా, ఎల శేఖర్ బాబు, విక్రమ్, పటేల్ సుధీర్ రెడ్డి, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, మాడిశెట్టి అజయ్, వినోద్, దినేష్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

