Mobile Popup Ad
Mobile Popup Ad

చింతకాని సీఎం సభ ఏర్పాట్లపై సమీక్ష

​కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలంలో జూన్ 30న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం సభ కోసం ఏకంగా 25 ఎకరాల స్థలంను సిద్ధం చేస్తుండగా, భద్రతా కారణాల దృష్ట్యా డ్యూటీ, వాహన పాసుల తుది జాబితాను 48 గంటల ముందే పోలీసు శాఖకు అందించాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అధికారులను ఆదేశించారు. జూన్ 28, 29 తేదీల్లో జరిగే రైతు మేళా, 30న సీఎం సభ ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌తో కలిసి ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.

​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మొత్తం 25 ఎకరాల స్థలంలో 20 ఎకరాలను బహిరంగ సభకు, 5 ఎకరాలను 150 ప్రదర్శన స్టాల్స్ కోసం కేటాయించాలని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నందున ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు ఉండకూడదన్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సభా ప్రాంగణంలో ప్రతి 250 మందికి ఒక బాధ్యుడిని నియమించి తాగునీటి పంపిణీ ప్రణాళికను అమలు చేయాలని, నాణ్యమైన భోజన వసతి కల్పించాలని స్పష్టం చేశారు. సభకు అయ్యే ప్రతి ఖర్చు నిబంధనల ప్రకారమే ఉండాలని, ప్రతి పైసా ఆడిట్‌కు లోబడి ఉంటుందని అధికారులను హెచ్చరించారు.

​పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉన్నందున నిర్దేశిత ప్రమాణాల ప్రకారం రెండు వేర్వేరు హెలిప్యాడ్లను సిద్ధం చేయాలని సూచించారు. సభా ప్రాంగణానికి వచ్చే రహదారుల మరమ్మతులు, అడ్డుగా ఉన్న చెట్లు, విద్యుత్ స్తంభాల తొలగింపు పనులను తక్షణమే పూర్తి చేయాలన్నారు. పార్కింగ్ ప్రాంతాలకు పకడ్బందీగా ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను రూపొందించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి, డిఎఫ్ఓ అనూజ్ అగర్వాల్, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>