Mobile Popup Ad
Mobile Popup Ad

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి.. ఎస్ఎఫ్ఐ ధర్నా

కలం, కరీంనగర్ బ్యూరో: జిల్లాలో (Karimnagar) విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ చిత్రా మిశ్రాకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభమైనా విధ్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోపాయరు. ప్రభుత్వం జూన్ 12 నాటికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ తదితర సౌకర్యాలను అందజేస్తామని ప్రకటించినా రోజులు గడుస్తున్నా ఇప్పటికీ విద్యార్థులకు యూనిఫాంలు పూర్తిస్థాయిలో అందలేదన్నారు.

నాణ్యమైన ఆహారం అందేలా చూడాలి..

పాఠ్యపుస్తకాలలోనూ కొన్ని టైటిల్స్ అందుబాటులో లేవన్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం అమలులో అనేక సమస్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. పెరిగిన ధరలకు అనుగుణంగా నిధులు పెంచకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం కష్టంగా మారిందన్నారు. అక్షయపాత్ర, ఇస్కాన్, మన్నా వంటి సంస్థల ద్వారా అందిస్తున్న భోజనం నాణ్యతపై పలు ప్రాంతాల నుండి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్న భోజన పథకానికి తగిన నిధులు కేటాయించి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యను వ్యాపారంగా మార్చాయని, పుస్తకాలు, నోట్‌బుక్స్, బెల్టులు, టైలు, షూలు, సాక్సులు తదితర వస్తువులను విద్యార్థులపై బలవంతంగా కొనుగోలు చేయిస్తున్నారన్నారు. పాఠశాలలకు ఆకర్షణీయమైన పేర్లు జోడించి ప్రచారం చేస్తూ నర్సరీ స్థాయి నుంచే లక్షలాది రూపాయల ఫీజులను వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించే ప్రత్యేక చట్టాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు.

ఎంఈఓ, టీచర్ పోస్టులను భర్తీ చేయాలి..

అదేవిధంగా రాష్ట్రంలోని సుమారు 27,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000 పాఠశాలలుగా కుదించే ప్రతిపాదన ప్రభుత్వ విద్యా వ్యవస్థకు నష్టం కలిగించే ప్రమాదం ఉందని చెప్పారు. కావున పాఠశాలల సంఖ్యను తగ్గించకుండా జనాభా ప్రాతిపదికన కొత్త ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేసి ఇప్పటికే ఉన్న పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు. కరీంనగర్ జిల్లాలో 16 మండలాలు ఉంటే చాలా మండలాల్లో రెగ్యులర్ ఎంఈఓ లేని పరిస్థితి ఉందని, కావున ఖాళీగా ఉన్న ఎంఈఓ, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కంపెళ్ళి అరవింద్, జిల్లా ఉపాధ్యక్షులు ఇషాక్, జిల్లా సహాయ కార్యదర్శి గట్టు ఆకాష్, జిల్లా కమిటీ సభ్యులు రత్నం సురేష్ సందేశ్, సన్నీ, అక్షయ్ మానస సంజన, సాయి తదితరులున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>