కలం, స్పోర్ట్స్ : ఐపీఎల్లో ఒక సంచలన మార్పునకు తెరలేచింది. ముంబై ఇండియన్స్ తమ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్‌కు (IPL Trade Deal) పెట్టినట్లు తెలుస్తోంది. రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టులోని ఒక స్పెషల్ స్టార్‌ను తమ గూటికి తెచ్చుకునేందుకే ముంబై ఈ భారీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మెగా డీల్‌పై ముంబై, రాజస్థాన్ ఫ్రాంచైజీల మధ్య ప్రస్తుతం ముమ్మరంగా చర్చలు సాగుతున్నాయి.
గత సీజన్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం, డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలు రావడంతో హార్దిక్ జట్టు మారాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను ముంబై తమ జట్టులోకి తీసుకోవాలని చూస్తోంది. రోహిత్ శర్మ కెరీర్ ముగింపు దశకు రావడం, భవిష్యత్తు కోసం ఒక పవర్ఫుల్ ఓపెనర్ అవసరం కావడంతో ముంబై కన్ను జైస్వాల్‌పై పడింది.
మరోవైపు రాజస్థాన్‌లో సంజూ శాంసన్ నిష్క్రమణ తర్వాత జైస్వాల్‌కు కెప్టెన్సీ దక్కలేదు. యాజమాన్యం రియాన్ పరాగ్‌కు మొగ్గు చూపడం, అలాగే 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ రాకతో జైస్వాల్ ప్రాధాన్యత తగ్గినట్లు టాక్. దీంతో ముంబై రంజీ ప్లేయర్ అయిన జైస్వాల్‌ను తెచ్చుకుని, ప్రతిగా హార్దిక్‌ను రాజస్థాన్‌కు ఇచ్చేలా ఈ ట్రేడ్ సాగుతోంది. ఇదే సమయంలో ముంబై సీనియర్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ కూడా కొత్త జట్టు వైపు చూస్తుండటంతో ఈ ఐపీఎల్ ట్రేడింగ్ మరింత ఆసక్తికరంగా మారింది.

