కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలో గత పాలకుల పదేళ్ల నిరంకుశ పాలనలో ఇళ్ల కోసం ఎదురుచూసిన పేదలకు తమ ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఇళ్ల’ (Indiramma Houses) పథకం ద్వారా బలమైన అండగా నిలుస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) తెలిపారు. ఖమ్మంలో (Khammam) సోమవారం నిర్వహించిన మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలను మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి పేదవానికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. గత ఏడాది 4.50 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, ఈ ఏడాది కూడా ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్ల చొప్పున కేటాయించామని చెప్పారు. ఐదేళ్లలో డ్వాక్రా మహిళలకు లక్ష కోట్ల రూపాయల రుణాలు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 30 నెలల్లోనే రూ.67 వేల కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశామని వెల్లడించారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడమే కాకుండా, డ్వాక్రా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయించి వారినే యజమానులుగా చేస్తున్నామని తెలిపారు. మహిళా శక్తి క్యాంటీన్‌లు , పెట్రోల్ బంకుల నిర్వహణలో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచినట్లు వెల్లడించారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థుల డైట్ చార్జీలను 40 శాతం, కాస్మోటిక్ చార్జీలను 200 శాతం పెంచామని తెలిపారు. త్వరలో అంతర్జాతీయ ప్రమాణాలతో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. పార్టీ కోసం కష్టపడ్డ మహిళా కార్యకర్తలకు తగిన గుర్తింపు, పదవులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, ఎమ్మెల్యే రామదాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

