కలం, ఖమ్మం బ్యూరో : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని, సామాన్య ప్రజలను నట్టేట ముంచిందని, ఎన్నికల హామీలన్నింటినీ పూర్తిగా తుంగలో తొక్కిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమావేశం స్థానిక కమ్మ కల్యాణ మండపంలో జరిగింది. ఈ సమావేశంలో పువ్వాడ అజయ్ కుమార్‌తో పాటు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తాత మధుసూదన్, తక్కిళ్లపల్లి రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ, కేసీఆర్ హయాంలో ప్రతి సీజన్లో నాట్లకు అండగా నిలిచిన రైతుబంధును కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్ల పండగగా మార్చిందని మండిపడ్డారు. వానాకాలం, యాసంగి సీజన్లు వస్తున్నా రైతులకు పెట్టుబడి సాయం అందక అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో రైతు చనిపోతే దశదినకర్మ లోపే రూ. 5 లక్షల బీమా సొమ్ము అకౌంట్లలో పడేదని, కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రీమియం కూడా కట్టకపోవడంతో రూ. 1400 కోట్ల ప్రీమియం బాకీ పడిందని విమర్శించారు. అరకొర రుణమాఫీతో రైతులను దారుణంగా వంచించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాడు కేసీఆర్ హయాంలో యూరియా బస్తాలు నేరుగా రైతులకు అందుబాటులో ఉంటే, నేడు షాపుల్లో దొరకాల్సిన యూరియాను యాప్‌లలో పెట్టారని, తీరా చూస్తే ఆ యాప్ అస్సలు పనిచేయడం లేదని ఎద్దేవా చేశారు. పోయిన యాసంగిలో పండించిన పంటను కొనే నాథుడు లేక, కనీసం గోనె సంచులు కూడా సరఫరా చేయలేక ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. నెలన్నర రోజులుగా రైతులు కల్లాల్లోనే ఉంటూ వర్షానికి ధాన్యం తడిసిపోతుంటే గడగడ వణికిపోయారని ఆవేదన చెందారు.
ఆడబిడ్డలకు ఇస్తామన్న రూ. 2,500 మహాలక్ష్మి పథకం, వృద్ధులకు రూ. 4000 పెన్షన్, నిరుద్యోగ భృతి వంటి ఆరు గ్యారెంటీల హామీలన్నీ అటకెక్కాయని దుయ్యబట్టారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తున్నా ఏ ఒక్క హామీని సక్రమంగా నెరవేర్చలేదని, పైగా హైదరాబాద్‌లో భూములను అమ్ముకుంటూ కాలక్షేపం చేస్తున్నారని అజయ్ ఆరోపించారు.
ఇటీవల జరిగిన వైరా మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజా తీర్పును అపహాస్యం చేస్తూ, కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలపై ప్రశ్నించిన ఒక మహిళా కౌన్సిలర్‌కు సమాధానం చెప్పలేక మున్సిపల్ చైర్మన్ ఆమెను దుర్భాషలాడటం కాంగ్రెస్ అహంకారానికి పరాకాష్ట అని మండిపడ్డారు. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కలిసిమెలిసి పనిచేసి పార్టీ జెండాను ఎగరవేయాలని, రాబోయే రోజుల్లో కేసీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా కదలాలని పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు.

